మార్చిలో మండిన సూరీడు: 122 ఏళ్ల రికార్డు, ఏప్రిల్ నెలలోనూ తప్పని భానుడి భగభగలు
న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి. గత మార్చి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. గత 122 ఏళ్లలో ఏ మార్చి నెలలోనూ నమోదవ్వని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది రికార్డయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.

మార్చిలో మండిన సూరీడు.. 122ఏళ్లలో ఇదే అత్యధికం
"దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 33.10 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 122 ఏళ్లలో ఇదే అత్యధికం" అని ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంత అసాధారణ వేడికి వర్షపాతం తగ్గిపోవడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా మార్చి నెల దేశవ్యాప్త వర్షపాత సుదీర్ఘ సగటు 30.4 మిల్లీమీటర్లు. ఈసారి అది కేవలం 8.9 మిల్లీమీటర్లకే పరిమితమైంది. దాదాపు 71 శాతం తక్కువ. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. వాయువ్య భారతదేశంలో 89 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని ఐఎండీ ప్రకటించింది.

వర్షపాతం తగ్గడంతో వేడి గాలులు
సాధారంగా కురిసే వర్షపాతం 47.5 మిల్లీ మీటర్లు కాగా.. మార్చి నెలలో 5.2 మిల్లీ మీటర్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వేడి గాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా రానున్న రెండు నుంచి నాలుగు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 2 నుంచి 4 మధ్య భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.

ఏప్రిల్‌లోనూ భానుడి భగభగలు
కాగా, ఏప్రిల్ తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది. ఇలాంటి వాతావరణం వల్ల అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలూ ఉన్నాయని, దీంతో అటవీ శాఖనూ అప్రమత్తం చేస్తున్నామని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో బయటతిరగకపోవడం మంచిదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications