వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైవర్‌లెస్ కార్లు వస్తే మన ప్రపంచం ఎలా మారిపోతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

డ్రైవరు లేకుండా నడిచే కార్లు రెడీ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఊహల్లో మాత్రమే ఉన్న ఈ కార్లు ఇప్పుడు వాస్తవరూపం దాల్చనున్నాయి.

వీటి తయారీలో ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా, త్వరలో తమంతట తామే నడిచే కార్లను రోడ్లపై చూడబోతున్నాం. వీటి తయారీ వల్ల ప్రపంచంలో మనం ఊహించని రీతిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

driverless car

అరిజోనాలోని ఫీనిక్స్‌ మెట్రో ప్రాంతంలో వీధి దీపాల వెలుతురు కింద ఓ కారు మెల్లగా నడుస్తోంది. వాహనంలోని యాక్టివ్ సెన్సర్ల్ శబ్దం చిన్నగా వినిపిస్తోంది. ఆకుపచ్చ, నీలం రంగుల్లో కారు అద్దం మీద డబ్ల్యూ అనే అక్షరం కనిపిస్తోంది. కారు డ్రైవర్ సీటులో ఎవరూ లేరన్న వాస్తవం ఆ కాంతిలో కళ్లకు కనిపించింది.

కారు పార్కింగ్‌ కు చేరుకోగానే, దాని కోసం వేచి ఉన్న వ్యక్తి ఫోన్‌లో మెసేజ్ వచ్చింది. తలుపు తెరిచి కారు ఎక్కగానే లోపలున్న సౌండ్ సిస్టం వారిని పలకరించింది. "గుడ్ ఈవినింగ్, ఇప్పుడు ఈ కారంతా మీదే.. డ్రైవర్ కూడా లేరు"

ఇది వేమో వన్ రోబోటాక్సీ యాప్‌లో బుక్ చేసుకున్న కారు. అమెరికాలో ఈ కారు సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. డ్రైవర్ లేని కార్లు మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయన్న వాస్తవాన్ని ఇది నిరూపిస్తున్నాయి.

డ్రైవరు లేని కార్లు మన ప్రయాణ అనుభవాలను గణనీయంగా మార్చనున్నాయి. అంతే కాకుండా రిస్క్‌తో కూడిన ఈ పని నుంచి అనేకమందికి విముక్తి కలుగుతుంది. పరిశ్రమలు క్రమబద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

భవిష్యత్తులో నగరాల నిర్మాణం, కార్లతో మనకున్న సంబంధాలను పునర్నిర్వచించేందుకు ఇది కీలకం అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. సుస్థిర జీవనానికి అడుగులు పడతాయి. వీటన్నిటితో పాటు, ఈ కారులో మన ప్రయాణం మరింత సురక్షితం కావొచ్చు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం 1.3 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.

"సురక్షితమైన రహదారులు ఉండాలి. మరణాల సంఖ్య తగ్గాలి. కార్ల ఆటోమేషన్ దీన్ని సాధిస్తుంది" అని బ్రిటన్ ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ లాబొరేటరీ (టీఆర్ఎల్)లో ఆటోమేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ హెడ్ కెమిల్లా ఫౌలర్ అన్నారు.

అయితే, డ్రైవర్ లేని కార్లు ప్రధాన స్రవంతిలోకి రావాలంటే ఇంకా చాలా మార్పులు రావాలి.

"వీటిల్లో ప్రయాణం ప్రశాంతంగా, మృదువుగా సాగాలి. అయితే, రోడ్డు మీద డ్రైవరు ఉన్న కార్లు కూడా వెళుతుంటాయి. అవన్నీ ఇలాగే మృదువుగా వెళతాయని చెప్పలేం. ఆ కార్ల వేగాన్ని, ప్రవర్తనను తట్టుకుంటూ ముందుకు వెళ్లగలగాలి. ఉదాహరణకు, రోడ్డు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలో తెలియాలి" అని టీఆర్ఎల్‌లో భద్రత, పరిశోధనల విభాగంలో చీఫ్ సైంటిస్ట్ డేవిడ్ హైండ్ అన్నారు.

అదొక్కటే సవాలు కాదు. రెగ్యులేషన్ నిబంధనలు, హైవే కోడ్‌లో మార్పులు, ప్రజల దృక్కోణం, నగరాలు, పట్టణాల్లో వీధులు, రోడ్ల నిర్మాణం, అంతిమంగా రోడ్డు ప్రమాదాలు.. ఇన్ని సవాళ్లు ఉన్నాయి.

"డ్రైవర్ లేని కారు ప్రమాదానికి లోనైతే ఏం చేయాలన్న అంశంపై మొత్తం పరిశ్రమ కసరత్తు చేస్తోంది" అని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన డ్రైవర్‌లెస్ వెహికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆక్స్బోటికా వాణిజ్య వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ జింక్స్ అన్నారు.

వ్యక్తిగత వినియోగానికి, విస్తృత స్థాయిలో రవాణాకు ఉపయోగపడేలా డ్రైవర్ లేని కార్లను రూపొందించేందుకు నిపుణులు కృషి చేస్తున్నారు.

ఇన్ని అడ్డంకులతో రాబోయే పదేళ్లల్లో డ్రైవర్‌లెస్ కార్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

మరో రెండేళ్లల్లో..

రోడ్డుపై సంక్లిష్టమైన, అనూహ్యమైన వాతావరణంలో కార్లను సురక్షితంగా, ప్రభావవంతంగా ఎలా ఆపరేట్ చేయాలన్నదే డ్రైవర్‌లెస్ టెక్నాలజీ పరిశ్రమలో పనిచేస్తున్నవారి ముందున్న అతి పెద్ద సవాలు. రాబోయే రెండేళ్లల్లో దీనికి పరిష్కరించడం పైనే దృష్టి సారిస్తారు.

మిషిగన్ యూనివర్సిటీలోని ఎంసిటీ టెస్ట్ ఫెసిలిటీలో నిపుణులు ఈ అంశాన్నే ప్రధానంగా పరిశీలిస్తున్నారు.

డ్రైవర్‌లెస్ కార్లకు ఇక్కడే మొట్టమొదటి టెస్టింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఇది, 16 ఎకరాల రహదారి, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు మీద గుర్తులు, అండర్ గ్రౌండ్ దారి, చెట్లు, భవనాలు, ఇంటి గ్యారేజీలు మొదలైనవాటన్నింటితో చిన్న పట్టణం లాంటిదాన్ని నిర్మించారు.

ఇక్కడ డ్రైవర్‌లెస్ కార్లను టెస్ట్ చేసి అందులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొంటారు.

"డ్రైవర్‌లెస్ టెక్నాలజీని పరీక్షించడానికి వందలాది అంశాలను పరిగణించాల్సి ఉంటుంది" అని మిషిగన్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ నెక్మియే ఓజే వివరించారు.

ఈ అడ్దంకులను అధిగమించాలంటే విభిన్నమైన ఆలోచనాపరుల గ్రూప్ ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆభిప్రాయం.

"ఇంజినీరింగ్ విభాగం మాత్రమే కాకుండా, సైకాలజీ, హూమన్-మెషిన్ ఇంటరాక్షన్ లాంటి భిన్న విభాగాల నుంచి నిపుణులను సంప్రదిస్తున్నాం. కార్ల భద్రత విషయంలో అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. వీరంతా అందుకు సహాయపడగలరని ఆశిస్తున్నాం" అని ఓజే చెప్పారు.

సుదీర్ఘకాలంగా ఇలాంటి అనేక పరీక్షలకు నిలబడి అరిజోనాలోని ఫీనిక్స్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలు రోడ్లపైకి వచ్చాయి. ప్రస్తుతం దగ్గర ప్రాంతాలకు, టెస్టింగ్ సర్వీసులు అందించేందుకు ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి.

రాబోయే రెండేళ్లల్లో ఈ టాక్సీలను మరింత విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉదాహరణకు, అమెరికాలోని వేమో కంపెనీ ఇతర ప్రాంతాల్లో కూడా టెస్టింగ్ కార్లను అందుబాటులోకి తెస్తోంది.

ఫలితంగా, 2023 కల్లా శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ లాంటి నగరాల్లో రోడ్లపై రోబోటాక్సీలను విరివిగా తిరుగుతుండడం చూడవచ్చు.

అలీబాబా పెట్టుబడి అందిస్తున్న స్టార్టప్ ఆటోఎక్స్ 2020లోనే చైనాలోని షాంఘై లో పూర్తిగా డ్రైవర్‌లెస్ రోబోటాక్సీని ప్రారంభించింది. 2023 కల్లా ఈ సంస్థ సర్వీసులు చైనాలోని ఇతర నగరాల్లో, కాలిఫోర్నియాలో కూడా అందుబాటులోకి రావొచ్చు.

డ్రైవర్‌లెస్ టెక్నాలజీని ఇప్పటికే గనులు, వేర్‌హౌస్‌లు, పోర్టులు మొదలైన చోట్ల ఉపయోగిస్తున్నారు. వచ్చే రెండేళ్లల్లో ఈ సేవలు "వినియోగదారుల వరకు విస్తరించవచ్చని" హైండ్ అభిప్రాయపడ్డారు.

వచ్చే అయిదేళ్లల్లో..

రాబోయే నాలుగేళ్లల్లో పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆపిల్ సంస్థ చెబుతోంది. అయితే, సమీప భవిష్యత్తులో రాబోయే పరిణామాల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కొత్త వాహనాల రెగ్యులేషన్, బీమా కంపెనీల నియమాలు సిద్ధం చేయాల్సి ఉందని కెమిల్లా ఫౌలర్ అన్నారు. ఆమె యూకే ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ లేబరేటరీ లో ఆటోమేటెడ్ విభాగానికి హెడ్‌గా పని చేస్తున్నారు.

అధిక రిస్క్ గల అణు కర్మాగారాలు, మిలటరీ కేంద్రాలు వంటి ప్రదేశాల్లో డ్రైవర్‌లెస్ సాంకేతికతను వినియోగించి పరిశీలించవచ్చు. తద్వారా మానవ జీవితాలకు ముప్పు తగ్గుతుందని ఫౌలర్ అభిప్రాయపడ్డారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని రియో టింటో గనుల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేటిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. అక్కడి ట్రక్కులను అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్త్ నగరం నుంచి నియంత్రిస్తారు.

"ఇలాంటి ప్రదేశాల్లో మనుషులు పనిచేయాల్సిన అవసరం లేకుండా డ్రైవర్‌లెస్ వాహనాలను వినియోగిస్తూ, దూరం నుంచి వాటిని నియంత్రించగలిగితే అంతకన్నా మేలు ఉండదు" అని ఫౌలర్ అన్నారు.

అయితే, రాబోయే ఐదేళ్లలో చాలా వరకు డ్రైవర్‌లెస్ టెక్నాలజీ తెర వెనుకే ఉండొచ్చు.

ప్రస్తుతం రద్దీగా ఉండే రోడ్లపై భారీ వస్తువులను తీసుకెళ్లే వాహనాలను ప్రవేశపెట్టేందుకు గల అవకాశాలను టీఆర్ఎల్ పరిశీలిస్తోంది.

ప్లాటూన్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఫ్లాటూన్లు అంటే పాక్షిక ప్రతిపత్తి గల వాహనాల సముదాయం. ఇవి ఒకదాని సమీపంలో మరొకటి నడుస్తుంటాయి. ఇతర వాహనాలు వాటిని విడదీసే అవకాశం లేకుండా కలిసికట్టుగా ప్రయాణిస్తాయి.

రోడ్లపై రద్దీని తగ్గించడానికి, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ప్లాటూన్లు ఉపయోగపడతాయి. తొలి సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్ తయారీదారు 'ప్లస్' సంస్థ వీటిని పరిశీలిస్తోంది.

వచ్చే ఏడేళ్లలో...

రాబోయే ఏడు సంవత్సరాలు ప్రారంభం, విస్తరణ, సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు, ఇవి ప్రజల విశ్వాసాన్ని ఎంత వరకు చూరగొంటాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

అయితే, నగరాలను ఈ టెక్నాలజీ కోసం మళ్లీ డిజైన్ చేస్తే అన్ని విధాలా ప్రజలు వీటిని స్వీకరించడానికి అవకాశాలు పెరుగుతాయని, అప్పుడు ఇవి మనల్ని అత్యాధునిక జీవితంలోకి తీసుకెళ్లగలుగుతాయని చాలామంది భావిస్తున్నారు.

"మీరు అధిక జన సాంద్రతగల పట్టణాల్లో నివసిస్తున్నట్లయితే, వీటిని ఒక సర్వీసుగా పొందవచ్చు. కాల్ చేయగానే రెండు నిమిషాలలో కారు మీ దగ్గరుంటుంది. కారులో వెళ్లి పోవచ్చు. వీధిలో కారు పార్కింగ్‌ కోసం స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం లేదు'' అన్నారు హైండ్.

వీధిలో కార్లు పార్కు చేసే అవసరం లేనప్పుడు గ్రీనరీకి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల సెల్ఫ్ డ్రైవింగ్ మరింత సురక్షితంగా మారుతుందని దీనిని సమర్ధించే వారు చెబుతున్నప్పటికీ, పాదచారులు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కలిసి ప్రయాణించే పరిస్థితి ఉండదని కొందరు వాదిస్తున్నారు.

అంటే, మన నగరాలు, మనం వాటిని వాడుకుంటున్న తీరును పున:పరిశీలించుకోవాల్సి ఉంటుందని దీని అర్ధం.

ఈ ఆలోచనలో కొంత భాగం ఇప్పటికే అమలు జరుగుతోంది. 2018లో ఐకియా కాన్సెప్ట్ అటానమస్ వెహికల్‌ను డెవలప్ చేసింది. దీనికి మన హోటల్ రూమ్‌లు, మీటింగ్ హాళ్లు, స్టోర్ రూమ్‌ల లాగా అవసరమైనప్పుడు విస్తరించుకోవచ్చు.

ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత

అన్ని రకాల డెవలప్‌మెంట్లు జరుగుతున్నప్పటికీ, రాబోయే దశాబ్ధ కాలంలో పూర్తిస్థాయి డ్రైవర్ లెస్ కార్లు సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

2031 నాటికి, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, అంటే పిల్లలను కార్లో కూర్చోబెట్టి ఎలాంటి చింత లేకుండా దూరంగా పంపగలిగే స్థాయికి మనం చేరుకుంటామని నేను అనుకోను'' అన్నారు ఓజే.

ఈ కొద్ది కాలంలో ఫుల్ ఆటోమేషన్ సాధ్యం కాకపోవచ్చని హైండ్ కూడా అంగీకరించారు. ''ఎలాంటి రవాణా సదుపాయాలు ఉన్నా, సమాజం ఎలాంటి సౌకర్యాలను అనుభవిస్తున్నా, ఇంకా చాలా అంశాల అవసరం ఉంటుంది'' అని హైండ్ అన్నారు.

ఇక్కడ కేవలం చట్టాల గురించే అనుకోకూడదు. భద్రత అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా భారీ ఖర్చులు భరించలేని దేశాలలో ఇది మరింత నెమ్మదిగా సాగుతుంది. ఈ టెక్నాలజీ ఎంతవేగంగా, ప్రభావవంతంగా అందుబాటులోకి వస్తుంది అన్నదానిని అక్కడున్న మౌలిక సదుపాయాలు నిర్దేశిస్తాయి.

ప్రజలలో అవగాహనతోపాటు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను వాడటానికి సుముఖత కూడా పెరగాలని హైండ్ అన్నారు.

అయితే, ఆలస్యం అవుతుందన్న వాదనను అందరూ అంగీకరించడం లేదు. ఇప్పటి నుండి 10 సంవత్సరాలలో మనుషులు నడిపే వాహనాల మాదిరిగానే రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తాయని జింక్స్ నమ్మకంగా ఉన్నారు.

అంటే, మనం ఎయిర్ పోర్ట్ దగ్గర డ్రైవర్‌లేని షటిల్‌‌లో ఎక్కి, అక్కడి నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీకి చేరుకుని, తర్వాత నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చు.

హైండ్ ప్రకారం, రాబోయే 10 సంవత్సరాలలో డ్రైవర్‌లెస్ కారుని సొంతం చేసుకునే అవకాశం తక్కువ. ఇది ఇప్పటికీ చాలామందికి కాస్ట్‌లీ వ్యవహారమే.

అలాగే డ్రైవర్‌లెస్ టెక్నాలజీ మనల్ని కార్ల మీద ఆధారపడకుండా, పర్యావరణానికి నష్టం కలగకుండా, టైమ్‌ వృథా కాకుండా ఎలా చేయగలదన్నది ముఖ్యం.

"ఇది శతాబ్దకాలంగా మనం పరిష్కరించాలనుకున్న ఇంజినీరింగ్ సమస్యలలో ఒకటి'' అన్నారు జింక్స్.

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కార్ పార్కింగ్‌లలో, వీధుల్లో ప్రవేశించినట్లుగానే, డ్రైవర్‌లెస్ కార్లు కూడా ఏదో ఒకరోజు మన దైనందిన ప్రపంచంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు మనం, ఇవి లేకుండా గతంలో ఎలా జీవించామా అని ఆలోచిస్తూ ఉంటాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How will world change when driverless cars make entry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X