నేను మార్క్సిస్టును: ఆధ్యాత్మిక గురువు దలైలామా
కోల్‌కతా: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తనను తాను మార్కిస్టుగా చెప్పుకున్నారు. చాలా మంది మార్క్సిస్టు నేతలు ఆలోచలో పెట్టుబడిదారులుగా మారిపోయారని ఆయన మంగళవారంనాడు వ్యాఖ్యానించారు. సామాజిక, ఆర్తిక సిద్ధాంతానికి సంబంధించి తాను ఇంకా మార్క్సిస్టునే అని ఆయన అన్నారు.
సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని తొలగించడంపై దృష్టి కేంద్రీకరించినందున తాను మార్క్సిజాన్ని ఆరాధిస్తానని ఆయన అన్నారు. చాలా మంది మార్క్సిస్టు నేతలు ఇప్పుడు ఆలోచనలో పెట్టుబడిదారులుగా మారారని, అది వారి ప్రేరణ, ఆలోచన, విశాల దృక్పథాలపై ఆఆదారపడి ఉంటుందని దలైలామా అన్నారు. ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో ప్రపంచ శాంతిపై ప్రసంగం చేస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
పెట్టుబడిదారీ దేశాల్లో ధనికులకు, పేదలకు మధ్య అంతరం పెరిగిపోతోందని, మార్క్సిజం సమాన పంపిణీకి ప్రాధాన్యం ఇస్తుందని, అదే తనకు అత్యంత కీలకమైందని ఆయన అన్నారు. మహిళల పట్ల వివక్షను ఆయన వ్యతిరేకించారు. కింది కులాల పట్ల, మహిళల పట్ల వివక్ష భారత దేశ శాంతిని దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లో షియాల కన్నా భారత్‌లో ముస్లింలు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.

21వ శతాబ్దాన్ని శాంతి శతాబ్దంగా తీర్చిదిద్దాలని ముప్పై ఏళ్ల వయస్సు పైబడనివారిని ఆయన కోరారు. గత శతాబ్దంలో హింస ప్రజ్వరిల్లిందని, తన జీవిత కాలంలో దాన్ని చూడలేనని, అయితే దానిపై పనిచేయడం ప్రారంభించాలని ఆయన అన్నారు. వాంఛ, దృష్టికోణం, తెలివితేటలతో హింసను నిలువరించవచ్చునని ఆయన అన్నారు.
తాను 16 ఏళ్ల వయస్సులో పారిపోయి, తన దేశంలో స్వేచ్ఛను కోల్పోయానని, భారతదేశంలో తాను స్వేచ్ఛను అనుభవించానని, ఈ దేశానికి లక్ష మందికి పైగా అనుచరులు వచ్చారని, తనకు వివిధ మత నేపథ్యాల నుంచి, సంప్రదాయాల నుంచి వచ్చిన నాయకులను కలుసుకునే అవకాశం లభించిందని దలైలామా అన్నారు. అందువల్ల భారత్ స్వేచ్ఛా దేశమని, అందువల్ల తాను స్వేచ్ఛను అనుభవించానని ఆయన అన్నారు. ప్రవాసంలో స్వేచ్ఛ అనే తన గ్రంథానికి అర్థం అదేనని ఆయన అన్నారు.
భారత ప్రాచీన తాత్వికతకు సంబంధించిన బోధకుడిని అని, భారత్ గురువు అయితే ప్రజలు శిష్యులని ఆయన అన్నారు. ఈ శిష్యులు చాలా విశ్వాసపాత్రులని, వేలాది ఏళ్లుగా గురువు జ్ఞానాన్ని చెక్కుచెదరకుండా నిలిపారని, ఇప్పుడు గురువు జ్ఞానం కన్నా శిష్యుల జ్ఞానం ఎక్కువ అని ఆయన అన్నారు. భారత్ శాంతి సాధనలో ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications