50 ఏళ్లొచ్చేంత వరకు అడవుల్లో గడిపా, పర్వతాల్లో కలియతిరిగా: ప్రధాని మోదీ ఎమోషనల్
అక్టోబర్ 7, 2026.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. సరిగ్గా పాతికేళ్ల కిందట అంటే.. 2001 అక్టోబర్ 7వ తేదీన ఆయన ప్రజా జీవితంలో అడుగు పెట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏకధాటిగా ప్రజా జీవితంలోనే కొనసాగుతున్నారు. అప్పుడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తూనే వస్తోన్నారు. ముఖ్యమంత్రిగా గానీ, ప్రధానిగా గానీ.. ఈ 25 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా విరామం రాలేదు.
సేవా జ్యోతిలో మోదీ ప్రసంగం..
ప్రజాసేవలో 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ రాజధానిలో నిర్వహించిన సేవా జ్యోతి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పలు అంశాలపై మాట్లాడారు. తన అంతరంగాన్ని బయటపెట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు గడిపిన తన పూర్వ జీవితాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఓ దశలో భావోద్వేగాలకు గురయ్యారు.

పదవుల కోసం పరుగెత్తలేదు..
తాను ఏనాడూ వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షల కోసం లేదా పదవుల కోసం పరుగెత్తలేదని, ఒక నిర్దుష్ట మహత్తర లక్ష్యం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఓ గొప్ప ఘనతగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ సుదీర్ఘ ప్రయాణం తనకు మాత్రం ఆత్మస్తుతి కోసమో, వ్యక్తిగతంగా వేడుక చేసుకోవాల్సిన సందర్భమో కాదని భావిస్తోన్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు..
50 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తాను అడవుల్లో గిరిజనుల మధ్య గడిపానని, పర్వత ప్రాంతాల్లో ఎంతో నిరాడంబరంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చానని ప్రధాని మోదీ అన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేతినిండా బాధ్యతలు ఉండే సంస్థాగత కార్యకర్తగానే సుదీర్ఘకాలం సేవలందించానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పార్టీ తరఫున ఎన్నో ఎన్నికల వ్యూహాల్లో పాలుపంచుకున్నప్పటికీ, తాను స్వయంగా ఎన్నికల బరిలో పోటీ చేయాలనే ఆలోచన ఎన్నడూ చేయలేదని ఆయన వివరించారు.

ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చేవాడిని..
ఒకవేళ తనకు ఎన్నికల రాజకీయాల్లో రాణించాలనే కోరిక, స్వార్థ ప్రయోజనాలు ఉండి ఉంటే చాలా కాలం క్రితమే ప్రత్యక్ష ఎన్నికల రణరంగంలోకి దిగి ఉండేవాడినని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అటువంటి తపన పడటం తన నైజం కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో తాను ఏ పదవిని చేపడతాననో, తన భవిష్యత్తు ఎలా మారుతుందో అనే విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. చిన్నతనంలోనే కుటుంబం, సమాజం నుండి నేర్చుకున్న అనుభవాలు, విలువలే తనను మహోన్నత ఆశయం వైపు నడిపించాయని వెల్లడించారు.
యువతలో నూతనోత్సాహం కనిపిస్తోంది..
ప్రస్తుతం దేశాభివృద్ధి కోసం యువతలో కనిపిస్తోన్న నూతనోత్సాహం అత్యంత అద్భుతమని ప్రధాని మోదీ కొనియాడారు. రాబోయే 2047 నాటికి సరికొత్తగా దేశాన్ని తీర్చిదిద్దే వికసిత్ భారత్ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. దేశాన్ని సంపూర్ణ స్వావలంబన దిశగా నడిపే ఆత్మనిర్భర్ భారత్ సాధనతో పాటు ప్రపంచ వేదికపై ఈ దేశాన్ని అత్యంత బలమైన తయారీ మార్కెట్ కేంద్రంగా మార్చడానికి అవసరమైన అన్ని రకాల బలమైన మౌలిక వసతుల పునాదులను వేస్తోన్నామని తెలిపారు.
#WATCH | Delhi | PM Modi says, "Speaking as the head of the government—this continuous journey of twenty-five years—people view it as an achievement. But how do I see it? For me, this is not a matter of personal glorification, nor is it the occasion for it. 25 years ago, at the age of 50, I had spent my time serving tribal communities in the forests and living amidst the mountains, eventually choosing the path of organizational work within the Bharatiya Janata Party. My political report card reflected only the work of an organizational worker. I had been involved in elections, yet I had never contested one myself. Had I desired to shine in electoral politics, I could have entered the arena long ago; but that was not my temperament. I never even stopped to consider what I would become in life or what my future held. This was because the upbringing and values instilled in me since childhood taught me to live my life for a mission, not for personal ambition."
— ANI (@ANI) October 7, 2026
ఎన్నో సవాళ్లు మన ముందున్నాయ్..
దేశం విభిన్న ఆధునిక రంగాల్లో సాధించబోయే సాంకేతిక, క్రీడా రంగ పురోగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాబోయే దశాబ్దాల్లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం, అంతరిక్ష పరిశోధనల్లో నూతన శిఖరాలు అధిరోహించడం వంటి భారీ ప్రణాళికలు మన ముందున్నాయని చెప్పారు. దేశ ప్రజల్లో ఉన్న అపారమైన మేధోశక్తి, శ్రమించే గుణంతో ఈ సవాళ్లన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయగలమని, వి విల్ డూ ఇట్.. అనే ఆత్మవిశ్వాసమే మనకు బలమని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
