ఇష్టం, ప్రధాని అవుతారు: మోడీ భార్య యశోదా బెన్
అహ్మదాబాద్: యశోదా బెన్ ప్రస్తుతం ఈ పేరు దేశంలో సంచలనంగా మారింది. వడొదరలో బుధవారం నామినేషన్ వేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన భార్య యశోదా బెన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తనకు ఆమెకు 17ఏళ్లకే వివాహం జరిగినట్లు, వారిద్దరూ సామరస్యంగానే విడిపోయినట్లు మోడీ ఈ సందర్భంగా తెలిపారు.
కాగా, నరేంద్ర మోడీ గురించి పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు చదవడం, చూడటం తనకు ఇష్టమని మోడీ భార్య యశోదాబెన్ తెలిపారు. మోడీనే దేశానికి ప్రధాని అవుతారని ఆమె చెప్పారు. ఇటీవల అహ్మదాబాద్‌లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలు ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే ఫొటో తీసేందుకు మాత్రం ఆమె అంగీకరించలేదు. తనకు 17 సంవత్సరాల వయసులో మోడీతో వివాహమైందని యశోదాబెన్ తెలిపారు. దీంతో చదువును మధ్యలోనే వదిలేసి అత్తవారింటికి వచ్చేశానని చెప్పారు.
పెళ్లయిన తర్వాత కూడా చదువుకోవాలని మోడీ చెప్పేవారని, అప్పట్లో వంటింటి విశేషాల గురించి కూడా మోడీ తనతో మాట్లాడేవారని వివరించారు. పెళ్లి తర్వాత వాద్‌నగర్‌లోని అత్తారింటికి వచ్చినప్పుడు... 'ఇంత చిన్న వయసులోనే అత్తారింటికి వచ్చే బదులు చదువు పూర్తి చేయాల్సింది' అని మోడీ తనతో చెప్పినట్లు ఆమె తెలిపారు. ‘తనకు దేశమంతా పర్యటించాలని ఉందని చెప్పేవారు. ఎక్కువ సమయం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శాఖలోనే గడిపేవారు. తక్కువగా ఇంటికి వచ్చేవారు. కొన్నాళ్లకు పూర్తిగా మానేశారు. నేను కూడా మా నాన్న దగ్గరికి వెళ్లిపోయాను' అని యశోదాబెన్ వివరించారు.

అయితే తమ మధ్య గొడవలేవీ జరగలేదని ఆమె తెలిపారు. తామెప్పుడూ ఘర్షణ పడలేదని, మంచి వాతావరణం మధ్యే విడిపోయామని ఆమె చెప్పారు. ‘పెళ్లయిన మూడేళ్లకు ఆయన వెళ్లిపోయారు. ఆ మూడేళ్లలోనూ మూడు నెలలు మాత్రమే మేం కలిసి ఉన్నాం. విడిపోయిన తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదు, పరస్పరం మాట్లాడుకోలేదు.' అని యశోద తెలిపారు. ‘అత్తమామలు బాగానే చూసుకున్నారు. నా ఇద్దరు సోదరులు ఎంతో మంచివారు. మళ్లీ పదో తరగతిలో చేరి చదువు కొనసాగించేందుకు వారే సహకరించారు.' అని ఆమె చెప్పారు.
‘తనకు తాను ఎప్పుడూ మోడీని కలవాలని ప్రయత్నించలేదని, ఆయన తనను తిరిగి పిలుస్తారని కూడా తాను భావించడంలేదని చెప్పారు. తన వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని కోరుకుంటున్నట్లు యశోదా బెన్ తెలిపారు. మోడీ తప్పకుండా ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏ పని చేపట్టినా... పట్టుదలగా ముందుకు వెళతారని యశోద తెలిపారు. మోదీ మిమ్మల్ని భార్యగా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ విషయంలో బాధగా ఉందా అని ప్రశ్నించగా.. ‘ఎంత మాత్రం లేదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్లే ఆయన అలా చేస్తున్నారని నాకు తెలుసు.' అని చెప్పారు.
చట్టబద్ధంగా ఇప్పటికీ మీరు మోదీకి భార్యేనా? అని ప్రశ్నించగా.. ‘మోడీ పేరు వచ్చినప్పుడల్లా నా ప్రస్తావన కూడా వస్తుంటుందనీ, ఎవరిదాకానో ఎందుకు... నాతో మాట్లాడేందుకు మీరు (మీడియా వారు) నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు! నేను మోదీ భార్యను కాకపోతే, నాతో మాట్లాడేవారా?' అని యశోదా బెన్ సమాధానమిచ్చారు. తాము విడిపోయిన తర్వాత తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని యశోద తెలిపారు. ప్రస్తుతం తాను తన పెద్దన్నయ్య వద్దే ఉంటున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం అలవాటనీ, ఎక్కువ సమయం దుర్గామాతను ప్రార్థిస్తూ ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications