దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడానికి ఈ మూడే ప్రధాన కారణాలు: ఐసీఎంఆర్ డీజీ బలరాం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2.73 లక్షల కరోనావైరస్ కొత్త కేసులు నమోదు కాగా, 1619 మంది కరోనా బారినపడి మరణించారు. కరోనా కల్లోలంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా తొలి.. రెండో దశ మరణాల్లో తేడా లేదు
కరోనా తొలి దశ మరణాల శాతానికి రెండో దశ మరణాల శాతానికి ఎలాంటి తేడా లేదని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ అన్నారు. అయితే, ఈ దశలో ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతోందని తెలిపారు. ఆస్పత్రుల్లో అధిక సంఖ్యలో కరోనా రోగులు చేరుతుండటమే ఇందుకు సమస్యగా మారుతోందన్నారు.

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ మూడే ప్రధాన కారణాలు
ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి మూడు కారణాలను గుర్తించారు. అజాగ్రత్త/నిర్లక్ష్యం, కోవిడ్ అనుచిత ప్రవర్తన, గుర్తించబడని వివిధ మ్యుటేషన్. ఈ మూడు విషయాలే కరోనా కేసుల పెరుగుదలకు కారణమని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసిన యూకే, బ్రెజిలియన్, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్లు.. కరోనా వ్యాప్తి వేగాన్ని పెంచాయన్నారు ఐసీఎంఆర్ డీజీ.

దేశంలో డబుల్ మ్యూటేంట్ ఉంది కానీ..
మనదేశంలో డబుల్ మ్యూటేంట్ గుర్తించినట్లు తెలిపారు. అయితే, దీని వ్యాప్తి వేగం ఎక్కువగా లేదని బలరాం భార్గవ తెలిపారు. కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 2,73,810 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులున్నాయి.
తాజాగా 1619 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి చేరింది. గత 24 గంటల్లో 1,44,178 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,29,53,821కి పెరిగింది. కాగా, దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా అరలక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications