కరోనా : ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. ఇకపై పూల్ టెస్టింగ్.. ఒకేసారి 5 శాంపిల్స్..
భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నంబర్స్ సరైనవేనా..? క్షేత్రస్థాయిలో దీని సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదా..? అన్న సందేహాలు కూడా లేకపోలేదు. దీనికి కారణం.. భారత్‌లో తక్కువ సంఖ్యలో టెస్టులు జరుగుతుండటమే. వరల్డ్ మీటర్ ప్రకారం అమెరికా లాంటి 30 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటివరకు 30లక్షల పైచిలుకు టెస్టులు జరిగాయి. ఒక మిలియన్ జనాభాకు సగటున 10వేల టెస్టులు నిర్వహించారు.
అదే భారత్ విషయానికొస్తే ఈ అంకెలు కాస్త షాకింగ్ గానే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ నిర్వహించిన టెస్టులు 2,44,893 మాత్రమే కాగా.. ఒక మిలియన్ జనాభాకు సగటున నిర్వహించిన టెస్టులు 177. అయితే ర్యాపిడ్ టెస్టుల సంఖ్య ఇందులో చేరట్లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా భారత్‌లో జరుగుతున్న టెస్టులపై అటు రాజకీయ నేతల నుంచి ఇటు సామాన్యుల నుంచి ప్రశ్నలు,సందేహాలు ఉత్పన్నమవుతుండటంతో ఐసీఎంఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఏంటా నిర్ణయం..
భారత్‌లో కరోనా టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పూల్ టెస్టింగ్ కోసం రోడ్ మ్యాప్‌ను సిద్దం చేసింది. దేశంలో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ విధానం ద్వారా టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. దీని ద్వారా ఒకేసారి ఐదు స్వాబ్ శాంపిల్స్‌ను పరీక్షించనున్నారు. సింగిల్ రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పాలిమరెస్ చైన్ రియాక్షన్(RT-PCR) ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

టెస్టింగ్ ఎలా ఉంటుంది..
పూల్ టెస్టింగ్ విధానంలో ఒకవేళ నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టయితే.. మొత్తం ఐదు శాంపిల్స్ నెగటివ్‌గా తేలినట్టే. ఒకవేళ పాజిటివ్ వస్తే.. మొత్తం ఐదు శాంపిల్స్‌ను విడివిడిగా మరోసారి పరీక్షించి నిర్దారిస్తారు. అందుబాటులో ఉన్న వనరులను మరింత మెరుగైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి పూల్ టెస్టింగ్ సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నయి. అయితే ఒకేసారి ఐదు శాంపిల్స్‌కు మించి టెస్టులు చేయలేమని ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఎక్కడ చేస్తారు...
ఈ తరహా విధానం ద్వారా ల్యాబోరేటరీల్లో టెస్టుల సంఖ్యను పెంచవచ్చునని ఐసీఎంఆర్ చెబుతోంది. సర్వైలైన్స్ పరమాణు టెస్టింగ్ ద్వారా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందో లేదో అధ్యయనం చేసే అవకాశం ఏర్పడుతుందని చెబుతోంది. దేశంలో వైరస్ ప్రభావం ఎక్కడైతే 2శాతం నుంచి 5శాతం మధ్య ఉందో.. ఆ ప్రాంతాల్లో పూల్ టెస్టింగ్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అది కూడా వైరస్ అనుమానిత లక్షణాలేవీ లేని వ్యక్తుల్లోనే టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఇందులో హెల్త్ కేర్ సిబ్బంది గానీ,లేదా కోవిడ్ 19 కాంటాక్ట్స్ ఉండరని పేర్కొంది.

పెరుగుతున్న కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదట్లో దేశవ్యాప్తంగా కేవలం పదుల సంఖ్యలోనే కేసులు నమోదవగా.. ప్రస్తుతం వెయ్యి మార్క్‌తో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1463 కేసులు నమోదయ్యాయి. దీతో మొత్తం కేసుల సంఖ్య 10,815కి చేరింది. ఇప్పటివరకు 353 మంది మృత్యువాతపడ్డారు. పెరుగుతున్న నంబర్స్‌ను చూస్తుంటే భారత్‌లో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన పెరుగుతోంది. ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్ పూల్ టెస్టింగ్ విధానానికి పూనుకుంది.












Click it and Unblock the Notifications