జార్ఖండ్‌కు అది పెనుముప్పు: శివరాజ్, హిమంత బిశ్వశర్మ హెచ్చరిక
రాంచీ: జార్ఖండ్‌లోని జేఎంఎం పార్టీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. జేఎంఎం పార్టీ వారసత్వ రాజకీయాలను మాత్రమే విశ్వసిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తోందని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున రాష్ట్రంలోని పలు చోట్ల ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌పై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం యువతకు 5 లక్షల ఉద్యోగాల ఇస్తామని హామీ ఇచ్చి.. ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు అనేక అవమానాలకు గురవుతున్నారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు జార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని.. ఇది రాష్ట్రానికి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదని.. ఎవరు పడితే వారి వచ్చి ఇక్కడ ఉండిపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న చొరబాటుదారులను జేఎంఎం కూటమి ప్రభుత్వం అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అంతేగాక, అక్రమవలసదారులకు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు.
మరోవైపు, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా జార్ఖండ్ ప్రభుత్వంపై రాంచీ ఎన్నికల ప్రచార సభలో విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజించాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఐక్యంగా ఉంటేనే ఇలాంటి ప్రయత్నాలు తిప్పిగొట్టగలమన్నారు. బంగ్లాదేశ్ నుంచి పెరుగుతున్న చొరబాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసలను అడ్డుకోకుంటే..రాష్ట్రంలో మహిళలకు తీవ్ర ముప్పుగా మారుతుందని హిమంత హెచ్చరించారు. బీజేపీని గెలిపించుకోండి.. లేకపోతే చొరబాటుదారులు ఇళ్లల్లోకి ప్రవేశించి మహిళలకు ముప్పుగా పరిణమిస్తారని జార్ఖండ్ ప్రజలను హెచ్చరించారు. బీజేపీతోనే జార్ఖండ్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
కాగా, జార్ఖండ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనుండగా, రెండో దశ 38 స్థానాల్లో నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications