చదువూసంధ్యా లేదు: రజనీపై స్వామి తీవ్రవ్యాఖ్యలు, మోడీపై తలైవా నో
Recommended Video

చెన్నై: తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌పై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రజనీకాంత్ కేవలం రాజకీయాల్లోకి వస్తున్నట్లు మాత్రమే ప్రకటన చేశారని తెలిపారు. కానీ అందుకు సంబంధించి డాక్యుమెంట్లు, వివరాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. అదే సమయంలో రజనీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజనీ చదువురానివాడు
రజనీకాంత్ చదువు రానివాడు అని సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు గుప్పించారు. చదువు సంధ్య లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. నటులు రాజకీయాల్లోకి రావడం తమిళనాట కొత్త కాదన్నారు. రజనీకాంత్‌కు మీడియా బాగా హైప్ తీసుకు వస్తోందని వ్యాఖ్యానించారు. కానీ తమిళ ప్రజలు చాలా తెలివి గల వారని తెలిపారు. తమిళ రాజకీయాల నుంచి నటులను వెలేసినప్పుడే తమిళనాడు ప్రతిష్ట పెరుగుతుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.

కనీస అవగాహన లేదు
తమిళనాడు సమస్యలపై రజనీకాంత్‌కు కనీస అవగాహన లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. నిరక్షరాస్యుడు ప్రజలకు ఏం నేర్పుతారన్నారు. ఓ సినిమా స్టార్ అవినీతిని ఆపుతారా అని ప్రశ్నించారు. అసలు రజనీ మొదట తన విధివిధానాలు ప్రకటించాలన్నారు.

ప్రకటనలో స్పష్టత లేదా
రజనీకాంత్ ప్రకటనలో స్పష్టత లేదా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ పెడతానని చెప్పిన రజనీ.. తేదీని ప్రకటించలేదు. అయితే, లోకసభ, అసెంబ్లీలలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

కేంద్రంపై విమర్శలు లేవు
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే బీజేపీతో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం మొదటి నుంచి సాగుతోంది. దానికి తగ్గట్లే రజనీ ప్రసంగం కొనసాగిందని అంటున్నారు. తమిళనాడు రాజకీయాలను చూసి నవ్వుకుంటున్నారని, దేశ రాజకీయాలు చెడిపోయాయని వ్యాఖ్యానించిన రజనీ.. కేంద్రంపై విమర్శలు చేయలేదని గుర్తు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేనట్లే
రజనీకాంత్ అసెంబ్లీ, లోకసభ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. దీనికి సమాయత్తం కావడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి రజనీ పోటీ చేయరని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications