బంగాళాఖాతం మీదుగా తూర్పు గాలి: చలికి తోడు భారీ వర్షాలు..!!
Bay of Bengal: మొన్నటివరకు భారీ వర్షాలతో అతలాకుతలమైంది తమిళనాడు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిశాయి. బీభత్సాన్ని సృష్టించాయి. అక్కడి రిజర్వాయర్లు, భారీ, మధ్య, చిన్న తరహా నీటి ప్రాజెక్టులు వరదనీటితో తొణికిసలాడుతున్నాయి.
ఈ పరిస్థితికి ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. మరో విడత భారీ వర్షాలు పొంచివున్నయి. నేటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాలకు- బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న బలమైన ఈస్టర్లీ విండ్స్లో చోటు చేసుకుంటోన్న మార్పులు కారణమని తెలిపింది.

ఈ ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వరకు ఉండొచ్చు. గంటకు 55 కిలో మీటర్ల వరకకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలో నైరుతి- దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురు గాలులు వీస్తాయి.
దీని ప్రభావంతో- చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వచ్చే 72 గంటల పాటు అంటే- ఈ నెల 8వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుదుచ్చేరి, కరైకల్‌ల్లోనూ ఇదే తీవ్రత కనిపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. అదే సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది.
నీలగిరి, దిండిగల్, కోయంబత్తూరు, సేలం వంటి జిల్లాల్లో వర్షాలతో పాటు పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. ఊటీ, కొడైకెనల్, కోటగిరి, కూనూరు, ఏర్కాడ్, ఏలగిరి, కుళుక్కుమలై, జవాధు హిల్స్ వంటి ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
చెన్నై సహా పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలో నమోదువుతూ వస్తోంది. నీలగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15 నుంచి 10 డిగ్రీల వరకు రికార్డవుతోంది. కామరాజ్ సాగర్ (శ్యాండీనల్లా) రిజర్వాయర్ పరిసరాల్లో 10 డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. తేని, కోయంబత్తూరు జిల్లాల్లో పశ్చిమ కనుమలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications