దళితుల బాసట: ఉత్తరాఖండ్‌లో ముస్లింల షాక్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బిజెపికి దళితులు బాసటగా నిలిచే అవకాశాలు మెరుగ్గా కనిసిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో 18.8 శాతం మంది దళితులు ఉన్నారు. వారంతా బిజెపికి మద్దతునివ్వడం కమలనాథులకు పండుగ వాతావరణమే.
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బిజెపికి దళితులు బాసటగా నిలిచే అవకాశాలు మెరుగ్గా కనిసిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో 18.8 శాతం మంది దళితులు ఉన్నారు. వారంతా బిజెపికి మద్దతునివ్వడం కమలనాథులకు పండుగ వాతావరణమే. రాష్ట్రంలోని 13 అసెంబ్లీ రిజర్వుడ్ స్థానాలకు 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు గెలుచుకుంది. బిజెపి ఐదు, బిఎస్పీ రెండు స్థానాలు గెలుచుకున్నది.
కుమాన్ జిల్లాలోని ఐదు రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడు, బిజెపి రెండు స్థానాల్లో విజయం సాధించింది. 20 స్థానాలకు పైగా దళితులు అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితంచేసే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జూలైలో రెండోసారి జరిగిన కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ప్రధాని నరేంద్రమోదీ అల్మోరా ఎంపి అజయ్ తాంతాకు అవకాశం కల్పించిన కేంద్ర సహాయ మంత్రిగా తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో బిజెపి పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది. సేవా దివస్ పేరిట కార్యక్రమాల నిర్వహణతోపాటు 70 అసెంబ్లీ స్థానాల పరిధిలో దళిత సమ్మేళనాలు జరిపింది.
కాంగ్రెస్ పార్టీ అసంత్రుప్తులకు బిజెపిలో అందలం
దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన మాజీ మంత్రి యశ్ పాల్ ఆర్యకు, ఆయన కుమారుడికి టిక్కెట్లు కేటాయించడం ద్వారా దళితుల ఓట్లను కొల్లగొట్టాలన్న వ్యూహం దాగి ఉంది. బిజెపి ఉత్తరాఖండ్ అధికార ప్రతినిధి బిందేశ్ గుప్తా స్పందిస్తూ తమ పార్టీ బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు. దళితుల సంక్షేమానికి కట్టుబడి తాము చేపట్టిన పలు కార్యక్రమాలను చూసిన తర్వాతేనా వారు వాస్తవాలు తెలుసుకుని తమ పార్టీకి ఓట్లేయడం ఖాయమని, రిజర్వుడ్ స్థానాలన్నీ తామే గెలుచుకుంటామన్నారు.
ఠాకూర్లు, బ్రాహ్మణులతో కూడిన సహజ సిద్ధమైన సంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు దళితుల 18.8 శాతం ఓట్లను పొందేందుకు బిజెపి గట్టిగానే కసరత్తు చేస్తోంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 33.79 శాతం ఓట్లతో 32, 33.13 శాతం ఓట్లతో 31 స్థానాలను బిజెపి గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి గల దళిత, ఓబీసీ నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదా?
కాంగ్రెస్ పార్టీకి ఓబీసీల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇతర వెనుకబడిన కులాల మండలి చైర్ పర్సన్ సంతోష్ కశ్యప్ సహా మరో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపిలో చేరడమే దీనికి కారణమని చెప్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం కొటారి, కార్యదర్శి హజి దిల్షాద్ అహ్మద్ ఖురేషి, ఓబీసీ సెల్ చైర్మన్ చంద్రశేఖర్ కశ్యప్ తదితరులు బిజెపి గూటికి చేరిపోయారు.

హరిద్వార్ జిల్లాలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న ఓబీసీ నేతల్లో సంతోష్ కశ్యప్ ఒకరు. హరిద్వార్ నుంచి హరీశ్ రావత్ పోటీ చేయడంలో ఆంతర్యమేమిటని కశ్యప్ ప్రశ్నించారు. హరిద్వార్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఒబిసి నేతకు టిక్కెట్ ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. దానికి బదులు హరీశ్ రావత్ పోటీ చేయడానికి సిద్ధం కావడం ఓబీసీలను మోసగించడమేనన్నారు. కనుక హరీశ్ రావత్ ను ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.
దళిత - ముస్లిం సమ్మేళనంపై మాయా ఫోకస్
దళితుల మనస్సులు చూరగొనే ప్రయత్నం కేవలం బిజెపిదీ మాత్రమే కాదు. బిఎస్పీ అధినేత మాయావతి సైతం దళితులతోపాటు ముస్లింలను తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు అత్యధికంగా గల హరిద్వార్, ఉద్దం సింగ్ నగర్ జిల్లాల్లో వచ్చేనెలలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బిఎస్పీకి దళితులు, ముస్లింలు సంప్రదాయ మద్దతుదారులుగా నిలవడం గమనార్హం.
తమ పార్టీ మాత్రమే దళితుల ఆకాంక్షలను నెరవేర్చగలదని బిఎస్పీ భ్రిగుర్షన్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల ఓట్లు పొందే విషయంలో పోటీ పడుతూనే ఉన్నది. రాష్ట్రం నుంచి తొలిసారి రాజ్యసభకు దళితుడ్ని పంపిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ప్రదీప్ తమ్తా గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికయ్యారు. బిజెపిలో ఆర్యా చేరిక తర్వాత తామ్తా మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖ దళిత నేత కావడం గమనార్హం. దళితుల ఓట్ల బలం, విలువ తమకు తెలుసునని కాంగ్రెస్ అధికార ప్రతినిధి హుకుంసింగ్ కున్వర్ తెలిపారు.
'కమలాని'కి ముస్లింల వ్యతిరేకత తప్పదా?
రెండున్నరేళ్ల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 19 స్థానాలు గెలుచుకున్న బిజెపికి ముస్లింలు ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారా? అంటే అవుననే చెప్తున్నాయి పరిణామాలు. త్రిపుల్ తలాఖ్, గో రక్షక్ అంశాలను అడ్డం పెట్టుకుని తమపై దాడిచేస్తున్న బిజెపిని దూరం పెట్టేందుకు ముస్లింలు సిద్దమవుతున్నారని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గణనీయ స్థాయిలోనే ముస్లింల ఓటుబ్యాంకు ఉంది.
రాష్ట్రమంతా 14 శాతం ముస్లింల జనాభా ఉంది. అందునా రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 23 సెగ్మెంట్లలో 15 - 50 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. హరిద్వార్ జిల్లాలో పది, ఉద్ధంసింగ్ నగర్‌లో ఎనిమిది, డెహ్రాడూన్‌లో మూడు, నైనిటాల్‌లో రెండు అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గాలు కీలకం కానున్నాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో 23 స్థానాలకు బిజెపి 10, కాంగ్రెస్ పార్టీ 10, బిఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.
మోదీ హవా లేదు.. నలుగురు మాజీ సీఎంల మధ్య పోటీ
ఈ నియోజకవర్గాల పరిధిలోనే బిజెపి గత లోక్ సభ ఎన్నికల్లో మోదీ హావాలో 19 స్థానాలను గెలుచుకుంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బిజెపి నేతలే అంగీకరిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మోదీ హవా వల్లే విజయం సాధించామని, ఈ దఫా ఆ పరిస్థితి లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒకరు తెలిపారు.
దీనికి తోడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారికంగా బిజెపి సీఎం అభ్యర్థి లేకుండానే బరిలోకి దిగుతున్నది. కానీ కమలనాథుల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు మరోసారి అవకాశాలు, సమీకరణాలు కలిసి వస్తే సిఎం పదవిని చేపట్టేందుకు తహతహలాడుతున్నారు. అందుకు అనుగుణమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
ముస్లిం మైనారిటీలకు ప్రత్యామ్నాయ వ్యూహం అమలులో బిజెపి
ప్రస్తుతం ముస్లిమేతర సామాజిక వర్గాలన్నీపార్టీల వారీగా విడిపోయి ఉన్నాయి. కానీ ముస్లింలు ఈ దఫా బిజెపికి వ్యతిరేకంగా సంఘటితంగా ఓటేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిసారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్వల్ప మెజారిటీతో అధికారం చేతులు మారుతుందని, ప్రతి సామాజిక వర్గం ఓటూ చాలా ముఖ్యమైనని, ముస్లిం మైనారిటీల ఓట్లు, ఆ సామాజిక వర్గం వ్యూహాలకు అనుగుణంగా తామూ ప్రతి వ్యూహం అమలుచేసే పనిలో ఉన్నామని మరో బిజెపి నేత తెలిపారు.












Click it and Unblock the Notifications