వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Eng: ‘‘నీకు లార్డ్స్ ఎంత గొప్పో, మాకు ముంబయి వాంఖడే అంతే గొప్ప’’ అని గంగూలీ ఎందుకన్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సౌరవ్ గంగూలీ

'లగాన్’ సినిమాలో ఆమిర్ ఖాన్ నాయకత్వంలో వీధి కుర్రాళ్ల క్రికెట్ టీమ్ ఇంగ్లీష్ టీమ్‌ను ఓడిస్తుంది. 20 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా సినీ, క్రికెట్ అభిమానుల్లో థ్రిల్‌ను నింపి సూపర్ హిట్టయింది.

అయితే, వాస్తవ ప్రపంచంలో పరిస్థితి అలా ఉండదు. ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లు పెద్దగా ఆసక్తి కలిగించవు.

క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ రక్తికట్టించిన పోరాటాలంటే భారత్-పాకిస్తాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లు, సిరీస్‌లే చాలామందికి గుర్తుకొస్తాయి.

భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా భావోద్వేగాలతో నిండిపోతుంది. ఈ పోరాటాన్ని ఇరు దేశాలతోపాటు క్రికెట్ ఆడే దేశాలన్నీ ఆసక్తిగా చూస్తాయి.

టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ ఎప్పటిలాగానే క్రికెట్ ప్రపంచాన్ని మునిగాళ్ల మీద నిలబెట్టింది.

అలాగని ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే అన్ని మ్యాచ్‌లు రక్తికట్టవు అని చెప్పడానికి లేదు.

వరల్డ్ సెమీ ఫైనల్స్ ఇండియా ఇంగ్లండ్ జట్లు తలపడ్డ సందర్భాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు సి.వెంకటేశ్ అన్నారు.

''1983 ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ఇంగ్లండ్‌తోనే సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించించి, అలాగే 1987 రిలయన్స్ వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో ఇండియా, ఇంగ్లండ్‌లు తలపడ్డాయి. ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది’’ అని ఆయన వివరించారు.

ఇండియా, ఇంగ్లండ్‌ జట్లు పరస్పరం టూర్‌లకు వెళ్లినప్పుడు అక్కడ చిరస్మరణీయమైన మ్యాచ్‌లు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

గురువారం ఇండియా ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడనుంది.

గత 20 ఏళ్లలో ఇండియా ఇంగ్లండ్ జట్ల మధ్య క్రికెట్‌ పోరులో టాప్ 5 మ్యాచ్‌లను అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లుగా క్రికెట్ చరిత్రలో చెప్పుకుంటారు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

గంగూలీ

1. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్-2002

నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్

సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన ఇండియా, ఆతిథ్య జట్టుతోపాటు, శ్రీలంకతో కలిసి ట్రైసిరీస్‌లో పాల్గొంది. ఫైనల్‌లో ఇంగ్లండ్, ఇండియాలు తలపడాల్సి వచ్చింది. స్వదేశంలో సత్తా చూపే ఇంగ్లండ్ జట్టు అప్పటికే పటిష్టమై బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో బలంగా ఉంది.

క్రికెట్‌కు మక్కాలాంటి లార్డ్స్ మైదానం ఈ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ జట్టు సాధించిన అత్యధిక స్కోర్ కూడా అదే. మార్కస్ ట్రెస్కోథిక్, కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌లు చెరో సెంచరీ చేసి ఆ జట్టును పటిష్టమైన స్థితికి చేర్చారు. 326 పరుగుల లక్ష్యాన్ని ఈ మ్యాచ్‌కు ముందు ఛేదించి ఎరుగని భారత జట్టు, బ్యాటింగ్‌తో విరుచుకుపడటం మొదలు పెట్టింది. కెప్టెన్ గంగూలీ(60), వీరేంద్ర సెహ్వాగ్‌(45)లు వికెట్ పడకుండా మొదటి 15 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. 106 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోని టీమిండియా, తర్వాత తడబడింది. ఓపెనర్లు గంగూలీ, సెహ్వాగ్ వెంటవెంటనే అవుట్ కావడం, ఆ తర్వాత వచ్చిన దినేశ్ మోంగియా, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్‌లు కూడా స్వల్ప స్కోర్లపై మైదానాన్ని వదిలిపెట్టడంతో భారత జట్టు గెలుపు అవకాశాలు దెబ్బతిన్నట్లు కనిపించింది.

కానీ, ఆ తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ (69), మహమ్మద్ కైఫ్(87) పరిస్థితిని చక్కదిద్దారు. జట్టు 48 బంతుల్లో 58 పరుగులు చేయాల్సిన తరుణంలో యువరాజ్ ఆరో వికెట్‌గా అవుటయ్యాడు.

ఒకపక్క స్కోరు దగ్గరపడుతుండగా, మరోవైపు వికెట్లు పడుతుండంతో గెలుపు అవకాశం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. మహమ్మద్ కైఫ్ తన జోరును కొనసాగించడం, హర్భజన్ సింగ్, కుంబ్లేలు తక్కువ స్కోరుకే అవుటైనా, జహీర్‌ఖాన్ సహకారంతో అతను కడదాకా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. యువరాజ్ అవుటైన తర్వాత సిక్స్‌లు, ఫోర్లతో 37 పరుగులు అందించాడు.

చివరకు 6 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో చివరి ఓవర్ మూడో బంతికి జహీర్ రెండు పరుగులు సాధించడంతో లార్డ్స్ మైదానం భారత క్రికెట్ అభిమానులు హర్షధ్వానాలతో హోరెత్తింది.

లార్డ్స్ స్టేడియం బాల్కనీలో భారత జట్టు సభ్యుల కేరింతల నడుము ఒక దృశ్యం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. జట్టు ఫైనల్ మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో కెప్టెన్ సౌరవ్ గంగూలి తన జెర్సీని విప్పి, గాలిలో ఊపుతూ కనిపించాడు.

ఈ దృశ్యం క్రీడాచరిత్రలో అత్యంత చిరస్మరణీయ దృశ్యాలలో ఒకటిగా మారిపోయింది.

ఈ ఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ గంగూలీని ఇంటర్వ్యూ చేస్తూ, '' నాటీబాయ్ లాగా ఆనాడు లార్డ్స్‌లో నువ్వు ప్రవర్తించినప్పటి అనుభవం చెప్పు’’ అని ప్రశ్నించాడు.

దానికి సౌరవ్ సమాధానమిస్తూ '' ముంబయిలో మీ జట్టు సభ్యుడు(ఆండ్రూ ఫ్లింటాఫ్) ఒకరు కూడా షర్టు విప్పారు కదా’’ అని సౌరవ్ సమాధానమిచ్చాడు.

దానికి జెఫ్రీ స్పందిస్తూ ''కానీ క్రికెట్ మక్కాలాంటి, లార్డ్స్ మైదానంలో నువ్వు ఆ పని చేశావు’’ అన్నారు.

''లార్డ్స్ మీ క్రికెట్ మక్కా అయితే, మాకు వాంఖడే( ముంబయిలోని స్టేడియం) కూడా అదే’’ అని గంగూలీ సమాధానమిచ్చారని ఇండియా టుడే రిపోర్ట్ చేసింది.

ఈ మ్యాచ్ విజయం భారత్‌కు అనేక రూపాల్లో చిరస్మరణీయంగా మారింది. యువరాజ్ సింగ్,మహమ్మద్ కైఫ్, జహీర్‌ఖాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. '' మిడిలార్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్‌లేని లోటు యువరాజ్, మహమ్మద్ కైఫ్‌ల ద్వారా తీరింది. నాట్‌వెస్ట్ ఫైనల్‌లో వీళ్లిద్దరూ బ్యాటింగ్‌కు దిగక ముందు మ్యాచ్ మీద భారత క్రికెట్ అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కైఫ్ కుటుంబ సభ్యులు దేవదాస్ సినిమాకు వెళ్లిపోయారు’’ అని వెంకటేశ్ వెల్లడించారు.

భారత జట్టుకు ఆనాటికి ఇది గ్రేటెస్ట్ విన్. ఈ విజయం తర్వాత భారత జట్టు మరింత పటిష్టమైన, అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలబడుతూ వచ్చింది.

ఫ్లింటాఫ్

2. ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా

ముంబయి వాంఖడే స్టేడియం- ఆరో వన్డే

నాట్‌వెస్ట్ టోర్నీలో భారత జట్టు కసిగా ఆడటానికి, గంగూలీ స్పందనకు నేపథ్యం ఉంది. అంతకు ముందే ఇంగ్లండ్ జట్టు భారత టూర్ పూర్తి చేసుకుని వెళ్లింది.

2001 నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు ఆడింది. ఇందులో టెస్టుల్లో భారత జట్టు 1-0 తేడాతో విజయం సాధించగా, వన్డే సిరీస్ 3-3 విజయాలతో సమంగా ముగిసింది.

అయితే, ఫిబ్రవరి 2న ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి వన్డే కూడా ఇదే తరహా భావోద్వేగాలకు వేదికగా మారింది.

వన్డే సిరీస్‌లో అప్పటికి 3-2 తేడాతో అధిక్యంలో ఉన్న భారత జట్టు, మరో విజయం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా, ఇంగ్లండ్ జట్టు సిరీస్ సమం చేయాలన్న పట్టుదలతో ఆడటంతో ముంబయి వన్డేలో హైడ్రామా చోటు చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 255 పరుగులు సాధించింది. 256 పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన భారత జట్టు, కెప్టెన్ సౌరవ్ గంగూలీ 80 పరుగులు అద్భుత బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చేరుకునేలాగానే కనిపించింది.

కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ విఫలం కావడంతో చివర్లో ఇంగ్లండ్ ముందు తలవంచాల్సి వచ్చింది.

చివరి ఓవర్లో 11 పరుగులు సాధించాల్సిన భారత జట్టు 250 పరుగులుకు ఆలవుట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ మైదానంలో తన జెర్సీ విప్పి, స్టేడియమంతా పరుగులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

''లార్డ్స్‌లో గంగూలీ జెర్సీ విప్పిన ఘటనకు, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ప్రవర్తనతో సంబంధం ఉంది. ఇంగ్లీష్ వాళ్లకు ఒక చాలెంజ్‌లాగా గంగూలీ ఇలా ప్రవర్తించాడు’’ అని క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.

బెంగళూరు వన్డే

3. వరల్డ్ కప్ 2011

బెంగళూర్ వన్డే

నాట్‌వెస్ట్ వన్డే తర్వాత ఇంగ్లండ్, ఇండియా టీమ్ మధ్య సాగిన మరో ఆసక్తికరమైన, థ్రిల్లింగ్ మ్యాచ్ బెంగళూరు వన్డే. 2011 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు 338 పరుగులు భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది.

సచిన్ టెండుల్కర్ 120, యువరాజ్ సింగ్ 58, గౌతమ్ గంభీర్ 51 పరుగులు చేయడంతో భారత పటిష్టమైన టార్గెట్‌ను ప్రత్యర్ధి జట్టు ముందు ఉంచగలిగింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా అంతే ధీటుగా ఆడి జట్టు స్కోరును అవలీలగా 300 పరుగులు దాటించారు. ఆండ్రూస్ట్రాస్ 145 బంతుల్లో 158 పరుగులు, ఇయన్ బెల్ 71 బంతుల్లో 69 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే, ఇటు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, చివర్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.

చివరకు 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు, నిర్ణిత 50 ఓవర్లలో 338 పరుగులు చేసి మ్యాచ్‌ను 'టై’ గా ముగించింది. ఇరుజట్ల బ్యాటర్లు పరుగుల వరద పారించడం, బౌలర్లు క్రమబద్ధంగా వికెట్లు తీస్తూ పోవడంతో స్టేడియంలో ఉన్న దాదాపు 38 వేలమంది క్రికెట్ అభిమానులు వంద ఓవర్లను ఆస్వాదించారు. ఇంగ్లండ్, ఇండియాల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఇది ఒకటిగా క్రికెట్ అభిమానులు చెప్పుకుంటారు.

చాంపియన్స్ ట్రోఫీ

4.చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్

బర్మింగ్‌హమ్-2013

2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ లోని బర్మింగ్‌హమ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగింది. 50 ఓవర్ల మ్యాచ్‌ను వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 129 పరుగులు మాత్రమే చేసింది.

టీ20 లలో 130 పరుగుల స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. పైగా ఇంగ్లండ్ సొంత గడ్డపై ఆడుతోంది. అయితే, ఆడుతూ పాడుతూ ఈ స్కోరును చేరుకోవచ్చనుకున్న ఆ జట్టు ఉత్సాహంపై భారత బౌలర్లు నీళ్లు చల్లారు.

అయితే, ఒక పక్క ప్రత్యర్ధి బౌలర్లు ఇరుకున పెట్టే బంతులతో ఇబ్బంది పెడుతున్నా, ఇంగ్లండ్ ఆటగాళ్లు మోర్గాన్(33), రవి బొపారా(30)లు తమ బ్యాటింగ్ తో ఎదురీదే ప్రయత్నం చేశారు. ఒక దశలో వీళ్లు మ్యాచ్ గెలిపిస్తారని అంతా అనుకున్నారు. అయితే, ఇషాంత్ శర్మ వరసగా రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఆశలు గల్లంతయ్యాయి. చివరకు 20 ఓవర్లలో 124 పరుగులు చేసి ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌ను కోల్పోయింది. భారత జట్టులో విరాట్ కోహ్లీ 43, శిఖర్ ధావన్‌ 31 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ ద్వారా 2002 తర్వాత చాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవాలని భారత జట్టు ఉవ్విళ్లూరగా, తొలిసారి ఈ ట్రోఫీ గెలుచుకోవాలని ఇంగ్లండ్ శతవిధాలా ప్రయత్నించినా చివరకు భారత జట్టు చేతిలో ఓటమి పాలైంది.

యువరాజ్ సింగ్

5. ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా

కటక్ వన్డే 2017

2017లో ఇంగ్లండ్ జట్టు ఇండియా టూర్‌కు వచ్చిన సందర్భంగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ కటక్ లో జరిగింది. అప్పటికే ఈ సిరీస్ లో భారత జట్టు 1-0 తో ఆధిక్యంలో ఉంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్లు 25 వికెట్లకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో నాలుగో వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్, తన బ్యాటింగ్‌లోని పూర్వపు మెరుపులను మరోసారి ప్రదర్శించాడు.

ఒక పక్క యువరాజ్ విధ్వంసం కొనసాగుతుండగా, ఆరో వికెట్ రూపంలో ఎంఎస్ ధోనీ మరో తుపానులా విరుచుకుపడ్డాడు. ఇద్దరూ కలిసి 256 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువరాజ్ సింగ్ 150 పరుగులు, ధోని 134 పరుగులతో భారత స్కోరు 381కి చేరుకుంది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమ్ లో ఇయాన్ మోర్గాన్ 102 పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లండ్ జట్టు 15 పరుగులు తేడాతో ఈ మ్యాచ్ లో ఓడిపోయింది.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో యువరాజ్ పునరాగమనానికి ఈ మ్యాచ్ వేదికగా మారింది. 127 బంతుల్లో 150 పరుగులు చేయగా, ధోనీ 122 బంతుల్లో 134 పరుగులు సాధించాడు.

ధోనీ సొంతగడ్డలాంటి కటక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత యువరాజ్-ధోనీ ద్వయం తమ అత్యుత్తమ బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించి ఇంగ్లండ్ జట్టు ఓడించింది.

గురువారంనాడు ఏం జరగబోతోంది? ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ అంత బలంగా లేదని క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ అన్నారు. ''శ్రీలంక మీద అతి కష్టం మీద గెలవడం, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడంలాంటి వాటిని బట్టి చూస్తే, ఇంగ్లండ్ పేపర్ మీద కనిపిస్తున్నంత బలంగా లేదని అర్ధమవుతుంది’’ అన్నారాయన. ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు ఆటతీరు ఏమంత గొప్పగా లేదని, ఒకరిద్దరు ఆటగాళ్లు తప్ప జట్టును గెలిపించగల సత్తా ఉన్నవాళ్లు కనిపించడం లేదని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఇక భారత జట్టు విషయానికి వస్తే, కోహ్లీ, సూర్యకుమార్ తప్ప మిగతా బ్యాటర్లు ఫామ్‌లో లేకపోవడం పెద్ద సమస్యన్నారు వెంకటేశ్. ''లోయర్ ఆర్డర్ సరిగ్గా లేదు. రోహిత్ ఫామ్‌లో లేడు. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు సరైన స్కోర్ చేయడం లేదు. మొదటి నలుగురు బ్యాటర్ల మీదనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది’’ అని వెంకటేశ్ విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ind Vs Eng: Why did Ganguly say, "How great Lord's is to you, Mumbai Wankhede is as great to us"?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X