సిద్ధరామయ్యకు పెరుగుతున్న మద్దతు- ఇండిపెండెంట్ కూడా సపోర్ట్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్‌ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా దీనికి హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో ఇవ్వాళ బెంగళూరులో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుల కోలాహలం కనిపించింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నివాసాల వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. తమ నాయకుడినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ డిమాండ్‌ను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వారి అభిమానులు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ అభినందనలు సైతం తెలియజేశారు.
పార్టీ సీనియర్లు ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటోన్నారంటూ బీటీఎం లేఅవుట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన మాజీ మంత్రి రామలింగారెడ్డి కూడా స్పష్టం చేశారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర కూడా ఆసక్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య ఈ ఉదయమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. సిద్ధరామయ్యను కలిసిన వారిలో కొత్త ఎమ్మెల్యేలు దినేష్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, పుట్టరంగ షెట్టి, సతీష్ జార్కిహోళి తదితరులు ఉన్నారు.
కాగా- విజయనగర జిల్లాలోని హరపనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇండిపెండెంట్ శాసన సభ్యురాలు సిద్ధరామయ్యను కలిశారు. ఆయనకు తన మద్దతు తెలిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన తాను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తోన్నానని తెలిపారు. ఆ విషయాన్ని తెలియజేయడానికి బెంగళూరుకు వచ్చానని వివరించారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications