ఎవర్ని పడితే వాళ్లను సాకడానికి భారత్.. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు ఫైర్
Supreme Court: శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్.. ధర్మసత్రం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో దేశం స్ట్రగుల్ అవుతోందని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో రెఫ్యూజీల విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థిని ఇంకా కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచుకోవడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటీషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నారా?, 140 కోట్ల మంది జనాభాతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాం, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన విదేశీయులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి భారత్.. ధర్మసత్రం కాదు.. అని బెంచ్ తేల్చి చెప్పింది.
శ్రీలంకకు చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంతో సంబంధం ఉన్నాడనే అనుమానంతో ఆ దేశీయుడిని 2015లో పోలీసులు అరెస్టు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్ 10 కింద అతన్ని కింది కోర్టు 2018లో దోషిగా నిర్ధారించింది. 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
2022లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షా కాలాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించింది. శిక్షా కాలం ముగిసిన వెంటనే అతను భారత్ విడిచి వెళ్లాలని, అప్పటి వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది. దీనిపై అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వాల్యుడ్ విసాపై భారత్ కు వచ్చానని, శ్రీలంకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటీషన్ దాఖలు చేశాడు.
దాదాపు మూడు సంవత్సరాలుగా తాను నిర్బంధంలోనే ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పిటిషనర్ తరపు న్యాయవాది.. బెంచ్ కు వివరించారు. భార్య, కుమారుడి ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని, మానవతా దృక్పథంతో భారత్ లోనే స్థిరపడ్డారని న్యాయవాది తెలిపారు. అన్నారు.
దీనిపై బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్ లో స్థిరపడటానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భారత్ లో స్థిరపడే ప్రాథమిక హక్కు దేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జస్టిస్ దీపాంకర్ దత్తా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications