దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరస్థితుల్లో ఎల్పీజీ గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సమాచారాన్ని అందజేసింది. దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. తగినన్ని నిల్వలు ఉన్నాయని పేర్కొంది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో తగినంత క్రూడ్ నిల్వలున్నాయని, రెండు నెలలకు ఇంధన సరఫరా రిజర్వ్ చేశామని తెలిపారు. శుద్ధి కర్మాగారాలు పూర్తి లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 20 శాతం పెరిగిందని ఆమె వివరించారు. ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు ఆటంకం ఏర్పడి, అంతర్జాతీయ ధరలు పెరిగాయని గుర్తు చేశారు.

దేశీయ సరఫరాలో స్థిరత్వం కోసం పలు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకున్నామని సుజాత శర్మ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘర్షణ కారణంగా దేశీయ సరఫరాలు ప్రభావితం అయ్యాయని పేర్కొన్నారు. క్రూడ్ ధరలు పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర ఉత్పత్తుల రేట్లు కూడా అధికం అయ్యాయని అన్నారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
ఇప్పటికీ, తమ వద్ద తగినంత క్రూడ్ నిల్వలు ఉన్నాయని, రాబోయే రెండు నెలలకు సరిపడా సరఫరాలు అందుబాటులో ఉన్నాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఎల్‌పీజీ, పీఎన్‌జీకి సంబంధించి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని తెలిపారు. ఆయిల్ రిఫైనరీలో 100 శాతం, అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. ఎల్‌పీజీ దిగుమతులపై 90 శాతం వరకు హార్ముజ్ జలసంధి ద్వారా ఆధారపడటంతో, ప్రభుత్వం దేశీయ వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చిందని శర్మ వివరించారు.
ఈ ప్రయత్నాల్లో భాగంగా మార్చి 14 నుండి సుమారు 30,000 టన్నుల వాణిజ్య ఎల్‌పిజి సరఫరా చేశామని, రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, వలస కార్మికులు, అలాగే స్టీల్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. వలస కార్మికులకు దాదాపు 30,000 అయిదు కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని, ఈ చర్యలు సప్లై చైన్ స్థిరీకరించి, దేశవ్యాప్తంగా ఇంధనాల లభ్యతను పెంపొందించాయని సుజాత శర్మ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications