పుతిన్ కు మోడీ కాల్ ? నాటో ఛీఫ్ కామెంట్స్ పై భారత్ ఫైర్..!
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల దెబ్బకు భారత్ పుతిన్ కు ఫోన్ చేసి బతిమాలుకున్నట్లు నాటో ఛీఫ్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారా లేదా అన్న దానిపై మోడీ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో .. ఇప్పుడు నాటో ఛీఫ్ కామెంట్స్ కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి.
దీంతో కేంద్రం ఇవాళ నాటో ఛీఫ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేసి తన ఉక్రెయిన్ వ్యూహాన్ని స్పష్టం చేయమని ఒత్తిడి చేయిస్తున్నాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది.

నాటో చీఫ్ ప్రకటన వాస్తవంగా తప్పు అని తేల్చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైనదని తెలిపింది. నాటో వంటి ముఖ్యమైన సంస్థ నాయకత్వం బహిరంగ ప్రకటనలలో మరింత బాధ్యత, ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుందని తాము ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. నిన్న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సాధారణ సభ భేటీ సందర్భంగా సీఎన్ఎన్ ఛానల్ తో మాట్లాడుతూ భారత వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయని రూటే వ్యాఖ్యానించారు.

ఈ సుంకం వెంటనే రష్యాపై ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు మాస్కోలో వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడుతోదని రూటే తెలిపారు. నేను మీకు మద్దతు ఇస్తున్నాను, కానీ మీరు మీ వ్యూహాన్ని నాకు వివరించగలరా ఎందుకంటే నేను ఇప్పుడు అమెరికా విధించిన ఈ 50 శాతం సుంకాల వల్ల దెబ్బతిన్నానంటూ మోడీ పుతిన్ ను అడిగినట్లు రూటే తెలిపారు. ఈ వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది.












Click it and Unblock the Notifications