కట్టడి చేయాలంటే..: ఏడు లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కొద్దిరోజుల కిందటి వరకూ 30 వేల వరకు నమోదైన రోజువారీ కేసులు ఒక్కసారిగా లక్షన్నరకు చేరుకున్నాయి. ఇదివరకటి కంటే వేగంగా విస్తరిస్తోంది కోవిడ్ మహమ్మారి. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. ఒమిక్రాన్ వల్లే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు.
దేశంలో పలు నగరాల్లో థర్డ్‌వేవ్ మొదలైందనే భయాందోళనలు మొదలయ్యాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,79,723 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది మరణించారు. 46,569 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరింది. ఇందులో 3,45,00,172 డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షల దాటాయి.
యాక్టివ్ కేసులు 7,23,619గా రికార్డయ్యాయి. 4,83,936 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 13.29 శాతంగా నమోదైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తంగా 151,94,05,951 డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఆదివారం ఒక్కరోజే 29,60,975 మేర డోసుల టీకాలు వినియోగమైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు నాలుగు వేలను దాటాయి. ఇప్పటిదాకా 4,033 కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ఇఫ్పటికే వెయ్యికి పైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో అత్యధిక పాజిటివ్స్ రికార్డయ్యాయి.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. అందుకు తగ్గట్టుగా మరణాలు నమోదు కాకపోవడం ఊరటనిస్తోంది. గత ఏడాది రోజువారీ కొత్త కేసుల సంఖ్య లక్షా 80 వేల వరకు ఉన్న సమయంలో మృతుల సంఖ్య వెయ్యికి పైగా ఉండేది. ఇప్పుడు కొత్త మరణాలు 146. వ్యాక్సిన్ వేసుకున్నందు వల్ల మరణాలు అదుపులో ఉంటోన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. అందుకే- ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications