ముమ్మాటికీ అంగీకారం కాదు: సౌదీ అరేబియా ఉదంతంపై తేల్చి చెప్పిన కేంద్రం
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న దాడుల పట్ల భారత్ ఘాటుగా స్పందించింది. ఈ దాడులను ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వేకువ జామున చోటుచేసుకున్న ఈ దాడిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. 309 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
వారం రోజుల్లో రియాద్ ఎయిర్ పోర్ట్ పై హౌతీలు దాడి చేయడం ఇది మూడోసారి. ఈ దాడుల పట్ల భారత్ తన నిరసన తెలియజేసింది. ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా పౌరుల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించే ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

సాధారణ పౌరులు, విమానాశ్రయాల వంటి పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ముమ్మాటికీ అంగీకారం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇటువంటి వినాశకర చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో శాంతి భద్రతలు నెలకొల్పడం అత్యవసరమని, ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సూచించింది.
ఈ కష్టసమయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు భారత్ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ భద్రతను కాపాడుకునే క్రమంలో సౌదీ ప్రభుత్వం తీసుకునే రక్షణ చర్యలకు పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఈ రీజియన్ లో త్వరలోనే శాంతి, స్థిరత్వం, సాధారణ పరిస్థితులు పునరుద్ధరణకు నోచుకుంటాయని ఆశిస్తోన్నామని తెలిపింది.
Statement on Houthi attacks on King Khalid International Airport and other civilian facilities ⬇️🔗 https://t.co/KqxIxD8ej5 https://t.co/S9IKDv13jQ
— Randhir Jaiswal (@MEAIndia) October 11, 2026
హింసాత్మక చర్యలను వీడి శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే దాడులను తక్షణమే విరమించుకోవాలని విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. సౌదీ అరేబియాలో వేలసంఖ్యలో భారతీయ కార్మికులు, నిపుణులు నివసిస్తోన్నారు. ఫలితంగా అక్కడి భద్రతా పరిణామాలు భారత్‌కు ఎంతో ప్రాముఖ్యమైనవి కూడా. గల్ఫ్ రీజియన్ లో సుస్థిర శాంతి నెలకొనడం భారత్ కు దౌత్యపరంగా ఎంతో అవసరం కూడా.













Click it and Unblock the Notifications
