India-Pakistan: పాక్ కుట్ర భగ్నం, ఏడుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను మన భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నియంత్రణ రేఖ (LOC)ను దాటేందుకు పయత్నిస్తుండగా.. ఏడుగురు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. కాగా, మృతుల్లో పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. దీంతో ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ సహకరిస్తున్నట్లు తేలిపోయింది.
జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఫిబ్రవరి 4-5 మధ్య రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖను దాటి భారత ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడికి యత్నిస్తున్న పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీంపై భారత సైన్యం మెరుపుదాడికి దిగింది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు చొరబాటు హతమైనట్లు భారత సైనికవర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ముగ్గురు ఆర్మీ రెగ్యులర్స్ ఉన్నట్లు పేర్కొన్నాయి.

హతమైన మిగితావారు ఉగ్రవాదులని, వారంతా అల్ బదర్ గ్రూప్‌నకు చెందినవారై ఉంటారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సరిహద్దులో శాంతి కోరుకుంటున్నామంటూనే పాకిస్థాన్ ఉగ్రచర్యలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరుదేశాల మధ్య శాంతి కోరుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాశ్మీర్ సహా అన్ని సమస్యలన్నింటినీ భారత్‌తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు పాక్ ప్రధాని షెహబాజ్. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రవాదులతోపాటు ఆర్మీ కూడా భారత్‌లో చొరబాటుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో పెద్ద ఎత్తున దాడికి పాక్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
మరోవైపు జైషే మహ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు తాజాగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కాశ్మీర్ సంఘీభావ దినం పేరుతో సంయుక్త సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీనికి హమాస్ ఉగ్రవాదులు కూడా హాజరైనట్లు ప్రచారం జరిగింది. దీంతో భారత నిఘా వర్గాలు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారేయాలంటూ కేంద్రం నుంచి ఆర్మీకి ఆదేశాలు వెళ్లాయి.












Click it and Unblock the Notifications