India-china : సరిహద్దులోనే కాదు.. చర్చల్లోనూ అదే ఫైర్... కనిపించని పురోగతి... కానీ....
అటు సరిహద్దులోనే కాదు... ఇటు మిలటరీ స్థాయి చర్చల్లోనూ భారత్-చైనాకు ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగట్లేదు. సమస్యల పరిష్కారానికి హాట్ లైన్ ద్వారా జరుపుతున్న చర్చల్లో ఏమాత్రం పురోగతి లేకపోగా... ఇరు దేశాలు వాడి వేడి వాదనలతో పరస్పరం విబేధించుకున్నాయి. ముక్పరి పర్వతంపై ఉన్న భారత స్థావరంపై దాడి యత్నాన్ని భారత బ్రిగేడ్ కమాండర్ తీవ్రంగా వ్యతిరేకించగా... చైనా బ్రిగేడ్ కమాండర్ దుందుడుకు సమాధానమిచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

సమర్థించుకునే ప్రయత్నం...
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గతంలో మాదిరి ఇనుపరాడ్లు,ముళ్ల కంచెలతో దాడులకు యత్నించడాన్ని భారత బ్రిగేడ్ కమాండర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై చైనా బ్రిగేడ్ కమాండర్‌ను నిలదీయగా... అవి తమ మార్షల్ కల్చర్‌లో భాగమంటూ బదులిచ్చారు. మారణాయుధాలతో దాడిని తమ తప్పుగా అంగీకరించకపోగా.... పైగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాడి వేడి వాదన చోటు చేసుకుంది.

పురోగతి లేదు.. కానీ....
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సెమీ పర్మినెంట్ స్టోన్ డిఫెన్స్ ఏర్పాటు చేసి ఉద్రిక్తతలకు తెరలేపడాన్ని భారత బ్రిగేడ్ కమాండర్ తీవ్రంగా తప్పు పట్టారు. మరోవైపు చైనా బ్రిగేడ్ అధికారి మాత్రం భారత ఆర్మీనే వాస్తవాధీన రేఖను దాటి తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని ఆరోపించారు. ప్యాంగాంగ్ త్సో దక్షిణ తీరంతో పాటు రేజంగ్ లా ప్రాంతాల్లో భారత్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మొత్తం మీద ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే సంప్రదింపులు,చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు హాట్ లైన్ కమ్యూనికేషన్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఒక అవగాహనకు వచ్చారు.

కాల్పుల కలకలం...
వాస్తవాధీన రేఖ వద్ద యధాతథ స్థితి(స్టేటస్ కో)ను మార్చేందుకు చైనా కొద్ది రోజులుగా మళ్లీ ప్రయత్నాలు షురూ చేసింది. ఇదే క్రమంలో సోమవారం అర్ధరాత్రి (సెప్టెంబర్ 7) భారత్ తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని... కాల్పులకు దిగిందని ఆరోపించింది. అయితే చైనా ఆర్మీనే ముందుగా గాల్లోకి కాల్పులు జరిపిందని భారత్ వెల్లడించింది. ఎల్ఏసీ నియామవళిని తాము ఉల్లంఘించలేదని.. వాస్తవాధీన రేఖ హద్దును దాటలేదని... చైనా దళాలే ఉల్లంఘణలకు పాల్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.












Click it and Unblock the Notifications