ఏడాది కిందటే భారత రక్షణ వ్యవస్థపై చైనా గూఢచర్యం- ఇప్పుడు బహిర్గతం..?!
అమెరికాను బెంబేలెత్తించిన చైనా స్పై బెలూన్ ఇప్పుడు భారత్ లో కనిపించింది. అండమాన్ గగనతలంపై బెలూన్ తరహా వస్తువును భారత వైమానిక దళాధికారులు గుర్తించారు.
న్యూఢిల్లీ: అనుమానిత చైనా స్పై బెలూన్.. కొద్దిరోజుల కిందట అమెరికాను గడగడలాడించింది. ఈ రెండు దేశాల మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. చైనా ప్రయోగించినట్లు భావించిన ఈ బెలూన్ అమెరికాలోని మోంటానాతో పాటు రక్షణపరంగా అత్యంత సున్నిత ప్రాంతాల గగనతలంపై కనిపించింది. దీన్ని స్పై బెలూన్ గా నిర్ధారించింది అమెరికా. మూడు బస్సుల పరిమాణంలో కనిపించిన ఈ బెలూన్ ను ధ్వంసం చేసింది.

చైనా నిఘా..
చైనా- దీన్ని గూఢచర్యానికి వినియోగించినట్లు అప్పట్లో అనుమానించింది అమెరికా. ఆ దేశ రక్షణ శాఖ సీనియర్ అధికారి సైతం దీన్ని ధృవీకరించారు. తైవాన్ అండగా ఉంటామని ప్రకటించిన అనంతరం ఈ బెలూన్.. తమదేశ గగనతలంపై కనిపించిందని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తోన్నామంటూ అప్పట్లో ప్రకటించారాయన. దక్షిణ చైనా సముద్రంలో చైనా తరచూ సైనిక కార్యకలాపాలను పాల్పడుతోందని, ఆసియా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని, ఇప్పుడు ఆ దేశం కన్ను తమపై పడినట్లు పేర్కొన్నారు.

ఉద్రిక్తతకు
దీని తరువాత- అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాను నిర్వహించ తలపెట్టిన చైనా పర్యటనను రద్దు చేసుకోవడం- రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పతాకస్థాయికి తీసుకెళ్లింది. తమపై అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిప్పి కొట్టింది. స్పై బెలూన్ పేరుతో అమెరికా కొత్త నాటకానికి తెర తీసిందంటూ వ్యాఖ్యానించింది. ఇతర దేశాల గగనతల నిబంధనలు ఉల్లంఘించే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పింది.

అలాంటి బెలూన్..
ఇప్పుడలాంటి స్పై బెలూన్ ను భారత్ వైమానికదళాధికారులు గుర్తించారు. అండమాన్ నికోబార్ గగనతలంపై బెలూన్ తరహా వస్తువు సంచరిస్తోన్నట్లు నిర్ధారించారు. ఏడాదికాలంగా ఈ తతంగం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కొద్దిరోజుల కిందట తాము అండమాన్ గగనతలంపై బెలూన్ తరహా ఓ తెల్లని వస్తువును చూశామని, దాని హై-రిజల్యూషన్ ఫొటోలను తీశామని రక్షణ శాఖ అధికారులు వివరించారు.

మూడు రోజుల పాటు..
ఏ కారణంతో ఈ బెలూన్ తరహా తెల్లని వస్తువు భారత భూభాగంపై సంచరిస్తోందనేది తెలియట్లేదని పేర్కొన్నారు. ఈ బెలూన్ పొరుగునే ఉన్న మయన్మార్ లేదా చైనా నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తోన్నామని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ధారణకు గానీ, స్పష్టతకు గానీ రాలేకపోతున్నామని అన్నారు. మూడు నాలుగు రోజుల పాటు భారత గగనతలంపై సంచరించిన తరువాత వెళ్లిపోయిందని స్పష్టం చేశారు.

మళ్లీ కనిపిస్తే..
బలమైన గాలులు వీచిన కారణంగా పాకిస్తాన్ వైపు నుంచి తరచూ ఇలాంటి బెలూన్లు భారత్ మీదుగా ప్రయాణిస్తుంటాయని, వాతావరణ అధ్యయనానికి సంబంధించిన వస్తువు కూడా అయి ఉండొచ్చని అంచనా వేస్తోన్నట్లు అధికారులు చెప్పారు. అండమాన్ లేదా మరేదైనా ప్రాంతం గగనతలంపై మళ్లీ ఇలాంటి వస్తువు కనిపిస్తే, దాని గురించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని వివరించారు. గూఢచర్య వస్తువుగా తేలితే- దాన్ని నేలపై దించొచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications