రైలు ప్రయాణికులకు బిగ్ షాక్... కొత్త ఛార్జీల అలర్ట్ !
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై ఈరోజు ( జూన్ 30, 2025 ) అర్ధరాత్రి నుంచే కొత్త ఛార్జీలు భారం పడనుంది. రైల్వే బోర్డు తాజా ప్రకటన ప్రకారం.. టికెట్ ధరలు పెంపుతో పాటు కొన్ని కీలక నిబంధనలను కూడా జారీ చేసింది. ఈ మార్పులు జూన్ 30 అర్థరాత్రి తర్వాత.. అంటే జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. అన్ని జోన్ల రైల్వే మేనేజర్లకు సర్క్యులర్ రూపంలో అధికారిక ఆదేశాలు పంపినట్లు సమాచారం.
రైల్వే శాఖ ప్రకారం, మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులైన సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెరిగాయి. ఇక ఏసీ తరగతులైన ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, 2-టైర్, ఫస్ట్ ఏసీ తరగతుల్లో కిలోమీటరుకు రెండు పైసల చొప్పున ధరలు పెంచారు.

ఆర్డినరీ రైళ్లపై ప్రత్యేక ఛార్జీలు..
ఆర్డినరీ (ప్యాసింజర్) రైళ్లలో స్లీపర్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు అర పైసా చొప్పున ధరలు పెరుగుతాయి. అయితే, ఆర్డినరీ సెకండ్ క్లాస్ ప్రయాణికులకు మాత్రం కొంత ఉపశమనం కల్పించారు. 0 నుంచి 500 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలే కొనసాగుతాయి. కానీ 501-1500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.5 అదనంగా వసూలు చేస్తారు. అలానే 2001-2500 కి.మీ. మధ్య రూ.10 అదనంగా తీసుకొనున్నారు.
2501-3000 కి.మీ. మధ్య కూడా రూ.15 అదనంగా ఛార్జీ విధించినట్టు స్పష్టం చేసింది రైల్వే శాఖ.
ఇక ఇప్పటికే రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ విధానంలో కూడా కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్ల అధికారులకు సూచనలు జారీ చేశాయి. ఇది ప్రయాణికుల గుర్తింపునకు, మోసాల నివారణ కోసం తీసుకున్న నిర్ణయంగా పేర్కొంది.
అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కొత్త ఛార్జీలు వర్తించవు. వారు పాత ధరలకే ప్రయాణించవచ్చని వెల్లడించారు. రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. పెరిగిన ధరలు జూలై 1 తర్వాత బుక్ అయ్యే టికెట్లపై మాత్రమే వర్తిస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా IRCTC యాప్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications