Indian Railways Parcel Service: ఇక ఇంటి నుంచే రైల్వే పార్సిల్ బుకింగ్!
భారతీయ రైల్వే నిత్యం ప్రయాణికులకు సరికొత్త సేవలు అందిస్తూ రవాణా రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తోంది. అదే బాటలో పార్సిల్ రవాణా విభాగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది. ఇన్నాళ్లూ పార్సిల్ పంపాలంటే స్టేషన్‌కు వెళ్లి క్యూలలో నిలబడాల్సిన తిప్పలకు ముగింపు పలుకుతూ 'డోర్-టు-డోర్' పార్సిల్ సేవలను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ సేవలను త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

'ఘర్ సే ఘర్ తక్' మొబైల్ యాప్.. ఒక్క క్లిక్‌తో ఇంటి వద్దకే!
'రైల్ పార్సిల్ యాప్ - ఘర్ సే ఘర్ తక్' పేరుతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా తమ ఇళ్ల నుంచే పార్సిళ్లను బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే నగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే లాజిస్టిక్స్ భాగస్వాములు నేరుగా మీ ఇంటికి వచ్చి పార్సిల్ సేకరించి, రైలు ద్వారా గమ్యస్థానానికి చేర్చాక అక్కడ సంబంధిత వ్యక్తుల ఇళ్లకు అందిస్తారు. దీనివల్ల ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా కావడమే కాకుండా రైల్వేలకు భారీ ఆదాయం సమకూరనుంది.
రైలు బయలుదేరే గంట ముందు వరకు బుకింగ్స్!
వినియోగదారుల సౌకర్యార్థం రైల్వే శాఖ బుకింగ్ నిబంధనలను చాలా సులభతరం చేసింది. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంచే పార్సిల్ బుకింగ్ విండో ఓపెన్ అవుతుంది. ప్రయాణ సమయానికి ఒకరోజు ముందు వరకు ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లు తమ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లాజిస్టిక్స్ భాగస్వాములు రైలు బయలుదేరడానికి సరిగ్గా గంట ముందు వరకు పార్సిళ్లను రైల్వే సిబ్బందికి అందజేసే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల కస్టమర్లు నేరుగా స్టేషన్లకు వచ్చి ఎలాంటి పేపర్‌వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు














Click it and Unblock the Notifications
