Indian railways: రైలు ప్రయాణంలో హెల్త్ ప్రాబ్లమ్.. రైల్వే ఏం చేస్తుందంటే!
ప్రతిరోజు భారతదేశంలో లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమంది దగ్గర ప్రాంతాలకు ప్రయాణం చేస్తే, కొంతమంది దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. దగ్గర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు అనారోగ్యానికి గురైతే వారి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ఆసుపత్రికి వెళతారు. కానీ ఒక్కోసారి సుదూర ప్రయాణాలు చేసేవారు మధ్యలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఏం చేయాలి?
రైలు ప్రయాణంలో అనారోగ్యానికి గురైతే ఏం చెయ్యాలి?
రైల్వే మన ఆరోగ్య రక్షణ కోసం ఏం చేస్తుంది? రైల్వే అధికారుల నుంచి ఎటువంటి సహాయాన్ని మనం తీసుకోవాలి? అనే విషయాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తితే కంగారు పడకుండా, ట్రైన్ లో టీటీఈని సంప్రదించాలి. ఆయనకు అనారోగ్య పరిస్థితిని గురించి వివరంగా చెప్పాలి.

రైళ్ళలో వైద్య సహాయం అవసరం అయితే ఇలా చెయ్యాలి
ఒకవేళ అప్పటికే స్టేషన్లో ఉంటే ఆ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు పరిస్థితిని చెబితే, రైల్వే వైద్యులు మీకు ప్రథమ చికిత్సను అందిస్తారు. అవసరమైతే వాళ్లే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించే అవకాశం ఉంటుంది. ఇక రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో వైద్య సహాయం అవసరం అయితే తర్వాత స్టేషన్లో తక్కువ ఖర్చుతో వైద్య చికిత్సను కూడా రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తారు.
వైద్య సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చెయ్యాలి
పరిస్థితి ఆందోళనకరంగా ఉండి ఉన్నఫలంగా ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి వస్తే మీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. దీనికి కూడా రైల్వే తగిన సహాయాన్ని అందిస్తుంది. రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యం తలెత్తితే తక్షణ వైద్య సహాయం కోసం 138 నెంబర్ కు కాల్ చేయాలి. అంతేకాదు ప్రయాణికుల అలారం బెల్ ను ఉపయోగించి డ్రైవర్ ని కూడా అప్రమత్తం చేయొచ్చు.
చిన్నపాటి సమస్య అయితే రైల్లోనే ప్రథమచికిత్స
ఇక రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా మీకు వైద్య సలహాతో పాటు, ఏదైనా చిన్నపాటి సమస్య అయితే ప్రథమచికిత్స చేస్తారు. అలాకాకుండా సమస్య తీవ్రంగా ఉంటే మిమ్మల్ని సమీపంలోని రైల్వేస్టేషన్లో దించి ఆసుపత్రికి తరలిస్తారు. ఇక మీ లగేజ్ కు సంబంధించి పెట్టుకోవడానికి ప్రధాన రైల్వే స్టేషన్లో క్లాక్ రూములు, లాకర్లు ఉంటాయి, వాటిలో గరిష్టంగా నెలరోజులపాటు లగేజీని దాచుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.
అనారోగ్యం అయితే రైల్వే సిబ్బంది సహాయం
దీనికోసం ముందస్తుగా వారికి తగిన డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా అనారోగ్య సమస్య వస్తే అసలు భయపడొద్దు. ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయడం గానీ, టి టి ఈ దగ్గరికి వెళ్లి చెప్పడం కానీ చేసి రైల్వే సిబ్బంది సహాయాన్ని పొందవచ్చు.












Click it and Unblock the Notifications