ప్రాణం పోశారు: పాక్ బాలికకు ముంబైలో చికిత్స
ముంబై: తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ పాకిస్థానీ బాలికకు ముంబై వాసులు భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించి ఆమెకు పునర్జన్మనిచ్చారు.
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 15 ఏళ్ల బాలిక సబా తారిఖ్ అహ్మద్ కొంతకాలంగా ‘విల్సన్స్' అనే వ్యాధితో బాధపడుతోంది. శరీరంలో రాగి మలినాలు పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కుమార్తెను ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తల్లి నజియా.. సబాను తీసుకుని ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రికి తీసుకొచ్చింది.
అయితే చికిత్స కోసం లక్షలాది రూపాయలు అవసరమవుతాయని తెలిసి నివ్వెరపోయింది. కాగా, విషయం తెలుసుకున్న 'బ్లూబెల్స్ కమ్యూనిటీ' అనే ఎన్జీవో సంస్థ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో సబా గురించిన వివరాలు వెల్లడిస్తూ, ధన సహాయం కోరడంతో పాటు సంస్థలో సభ్యులుగా ఉన్న ముంబై వాసుల నుంచి రూ. 7 లక్షలు సమీకరించింది.
ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది తమకు తోచినంత దానం చేయగా, మొత్తం రూ. 13 లక్షల నిధి ఏర్పడింది. దీంతో ఆ బాలికకు పూర్తి చికిత్స అందించారు వైద్యులు. ప్రస్తుతం సబా కోలుకుంటున్నట్టు జస్‌లోక్ ఆస్పత్రి వైద్యుడు నగ్రాల్ తెలిపారు. సబా శరీరంలో ఉన్న రాగి విషపదార్థాలను తొలగించేందుకు క్యాప్సూల్స్ ఇస్తున్నామని, అయితే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవన్నారు.

ఈ క్యాప్సూల్స్ భారత్‌లో తయారు కావని వంద క్యాప్సూల్స్ 84 వేల రూపాయలని వివరించారు. ప్రస్తుతం సబాకు రోజుకు రెండు చొప్పున ఇస్తున్నట్టు నగ్రాల్ తెలిపారు. బాలిక సబా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బిగ్ ఫ్యాన్ అని, ఆమె కోరిక తీర్చేందుకు సల్మాన్‌ఖాన్ థీమ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్టు డాక్టర్ నగ్రాల్ తెలిపారు.
కాగా, సబా తల్లి నజియా మాట్లాడుతూ.. తాను ముంబై వెళ్లడానికి సిద్ధమైనప్పుడు తమవారు తనను వారించారని, భారత్‌లో పరిస్థితులు అంత మంచిగా ఉండవని హెచ్చరించారని తెలిపారు.
అయితే ఇక్కడకొచ్చిన తర్వాత భారతీయుల ప్రేమాభిమానాలు చూసి చలించిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ముంబై వాసులు పంచిన ప్రేమను తను, తన కుమార్తె సబా ఎప్పటికీ మర్చిపోలేమని ఆమె తెలిపారు.
కాగా, పాకిస్థాన్ మాజీ మంత్రి రాసిన ఓ పుస్తకావిష్కరణకు నిరసనగా మాజీ బిజెపి సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు సిరా గుప్పించిన రోజే.. ఆ బాలిక తన తల్లితో కలిసి భారతీయులు, ముఖ్యంగా ముంబై వాసుల ప్రేమాభిమానాలను మదిలో దాచుకుని కరాచీకి బయలుదేరింది.












Click it and Unblock the Notifications