2023-24లో భారత జీడీపీ వృద్ధి రేటు 8.2శాతం: ఇది ట్రైలర్ మాత్రమే అంటూ మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడీపీ గణాంకాలు వెల్లడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో భారత్ 8.2శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) శుక్రవారం వెల్లడించింది. చివరి జనవరి-మార్చి త్రైమాసికంలో 7.8శాతంతో కాస్త నెమ్మదించినా.. తయారీరంగం పుంజుకోవడం వల్ల ఈ వృద్ధి నమోదైందని తెలిపింది.
గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన వృద్ధి సాధించిందని గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధ ఒడిదుడుకులకు లోనైనా భారత్ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేయడం విశేషం.

తయారీ రంగం ప్రోత్సాహకర వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడీపీ గణాంకాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. 2023-24లో తయారీ రంగం ఏకంగా 9.9 శాతం వృద్ధి చెందింది. ఇక చివరి క్వార్టర్‌లోనూ భారత జీడీపీ 7.8 శాతంతో సత్తా చాటిందని తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు, సవాళ్లు ఎదురైనా మన ఆర్ధిక వ్యవస్ధ పునరుత్తేజంతో ఉరకలెత్తిందని తెలిపింది.
మోడీ 3.0 అంటూ నిర్మలా సీతారామన్
ఈ వృద్ధిని అద్భుతమైనదిగా వర్ణించిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ జోరు మోడీ 3.0లో కూడా కొనసాగుతుందని అన్నారు.
కాగా, ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ USD 3.5ట్రిలియన్లకు చేరడానికి చోదక శక్తిగా పనిచేసింది. తద్వారా రాబోయే కొన్నేళ్లలో 5ట్రిలియన్ డాలర్లు లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సిద్ధం చేసింది.
ఇది ట్రైలర్ మాత్రమేనంటూ ప్రధాని మోడీ ప్రశంసలు
భారత జీడీపీ వృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.
2023-24 క్యూ4 జిడిపి వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపును చూపుతోంది, ఇది మరింత వేగవంతం కావడానికి సిద్ధంగా ఉంది. మన దేశంలోని కష్టపడి పనిచేసే ప్రజలకు ధన్యవాదాలు, 2023-24 సంవత్సరానికి 8.2% వృద్ధి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నేను చెప్పినట్లు, ఇది రాబోయే విషయాల ట్రైలర్ మాత్రమే అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications