ఆకాశంలో పిడుగుల వర్షం.. 17 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీ!
దట్టంగా కమ్ముకున్న మేఘాలు.. కను చూపు మేర అంతా మెరుపులే. కారు మబ్బులను చీల్చుకుంటూ దూసుకెళ్తుందో ఓ విమానం. అందులో మొత్తం 110 మంది ఉన్నారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుందని అనుకోనే లోపే ఓ భారీ శబ్ధం. ఓ పెద్ద పిడుగు నేరుగా విమానాన్ని ఢీ కొట్టింది. అంతే కట్ చేస్తే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి.
పాట్నా నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో విమానానికి (6E 625) ఆకాశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైంది. విమానం సుమారు 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బలమైన పిడుగు పడటంతో పాటు వడగండ్ల వాన దాడి చేసింది. దీంతో విమానం ముందు భాగం (నోస్ కోన్ / రాడోమ్) తీవ్రంగా దెబ్బతింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్ ల్యాండ్ చేయడంతో 104 మంది ప్రయాణికులు, 6 గురు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

అనుకోకుండా చుట్టుముట్టిన ప్రతికూల వాతావరణం
లక్నో విమానాశ్రయంలో ల్యాండింగ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ దిగ్భ్రాంతి సంచలనం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆకాశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాల్లో వడగండ్ల వానతో పాటు ఉరుములు, మెరుపులు ఉధృతమయ్యాయి. ఈ క్రమంలోనే విమానాన్ని పిడుగు తాకడంతో ముందరి రాడార్ వ్యవస్థను కప్పివుంచే 'రాడోమ్' భాగానికి చొట్ట పడి తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యంత క్లిష్ట సమయం అయినప్పటికీ పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, నిర్ణీత సమయం కంటే ఎనిమిది నిమిషాల ముందే సురక్షితంగా ల్యాండింగ్ పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.
దర్యాప్తుకు డీజీసీఏ (DGCA) ఆదేశాలు
ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. విమానానికి జరిగిన నష్టంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సదరు విమానాన్ని విమానాశ్రయంలో నిలిపివేశారు. "ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం, వడగండ్ల వాన వల్ల విమానం ముందు భాగం దెబ్బతిన్న మాట వాస్తవమే. ప్రయాణికులందరూ క్షేమంగా ల్యాండ్ అయ్యారు. సాంకేతిక నిపుణుల పరిశీలన, తగిన అనుమతుల అనంతరం మాత్రమే విమానాన్ని తిరిగి సేవల్లోకి తీసుకొస్తాం" అని ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
మళ్లీ మళ్లీ ఇండిగోకే ప్రమాదాలు!
ఇటీవలి కాలంలో ఇండిగో విమానాలకు వరుసగా సాంకేతిక, వాతావరణ సమస్యలు ఎదురవుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత నెలలోనే గౌహతి నుంచి బెంగళూరు వచ్చిన మరో ఇండిగో విమానం (A321neo) ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలుల వల్ల రన్‌వేను బలంగా ఢీకొట్టి 'టైల్ స్ట్రైక్' (వెనుక భాగం రన్‌వేకి తగలడం) కి గురైంది. ఆ విమానాన్ని కూడా అత్యవసరంగా నిలిపివేసి తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు పడటం ప్రయాణికుల భద్రతపై సరికొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.














Click it and Unblock the Notifications
