హత్యలో ట్విస్ట్‌లు: ముందే ఇన్ఫోసిస్ టెక్కీని కొట్టాడు, ఆ 2 ఘటనలు..
చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్‌లో ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ ఇంజినీర స్వాతి హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు కొద్ది రోజుల క్రితం స్వాతిని ఓ వ్యక్తి చెంప దెబ్బ కొట్టినట్లుగా ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్లాన్ ప్రకారమే ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 5 లక్షల ఫోన్ కాల్స్ విశ్లేషణ
ఓ ప్రయాణీకుడు తమిళరాసన్ చెబుతున్న దాని ప్రకారం.. హత్య జరిగిన ప్రాంతంలోనే రెండు వారాల క్రితం మరో వ్యక్తి స్వాతిని వేధించాడు. ఆమెను చెంప పైన పలుమార్లు కొట్టాడు. అయితే, స్వాతి మాత్రం మౌనంగా రైలు ఎక్కి వెళ్లిపోయారు. ఓ సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తున్న వ్యక్తే ఆ రోజు తాను చూసిన వ్యక్తి అని కూడా సదరు ప్రయాణీకుడు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన జూన్ 6 లేదా ఏడో తేదిన జరిగి ఉంటుందని అతను చెప్పాడు. ఆ తర్వాత హత్య ఘటన గురించి మాట్లాడుతూ... స్వాతిని హత్య చేసిన తర్వాత అతడిని పట్టుకునేందుకు ఇద్దరు పరుగెత్తారని, కానీ మరో ప్లాట్ ఫాం పైకి రైలు రావడం, అంతకుముందే నిందితుడు ట్రాక్ దాటడం జరిగిందని, దీంతో పరుగెత్తిన వారు అతనిని పట్టుకోలేకపోవడం జరిగిందని చెప్పారు.
ప్రతి రోజు ఉదయం గం.6.50కి వచ్చే రైలులో చెంగల్ పేటకు దాదాపు 60 మంది వెళ్తూ ఉంటారని అతను చెప్పారు. స్వాతి కూడా తమతో పాటు వస్తూ ఉంటుందని రోజు ప్రయాణించే అతను చెప్పాడు. స్వాతి చురుగ్గా ఉంటారని, ఆమెను చూడకుండా ఉండటం కష్టమని చెప్పాడు.
ఆమెపై దాడి చేసిన వ్యక్తి రెండు నిమిషాలు ఆమె వద్దే ఉన్నాడని చెప్పాడు. ఆమె కేకలు పెట్టిందని, రక్తపు మడుగులో కొట్టుకొని ఉండగా అందరం దాదాపు మూడు నిమిషాలు చూశామని చెప్పాడు. ఆ తర్వాత రైలు రావడంతో రైలెక్కేశామని చెప్పాడు. కాగా, ఈ రెండు ఘటనలకు ఆయన సాక్షి.

స్వాతి హత్య గత నెల 24వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు ప్రొఫెషనల్ కిల్లర్ అయి ఉంటాడని, అతను ఓ కిరాయి హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కిరాయి హంతకుడితో స్వాతిని ఎందుకు హత్య చేయించారు? ఎవరు హత్య చేయించి ఉంటారనేది తేలడం లేదు.
స్వాతి తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్ వచ్చి అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇన్ఫోసిస్ కార్యాలయానికి రైలులో వెళ్తుంది. హంతకుడు ఆమెను రెండు వారాలుగా అనుసరించాడు. జూన్ 9, 10 తేదీలలో స్వాతితో ఓ స్నేహితురాలు కూడా ఉంది.
అప్పుడు కూడా అతను ఫాలో అయినట్లుగా ఆ స్నేహితురాలు చెప్పారు. స్వాతి, ఆ స్నేహితురాలు కలిసి ఆఫీస్ వెళ్తారు. అయితే, జూన్ 24వ తేదీన ఆ స్నేహితురాలు సెలవు పెట్టింది. దీంతో, ఆ రోజు హంతకుడికి పనీ మరీ సులువు అయింది.
స్వాతిని చంపిన అనంతరం నిందితుడు పదకొండు నిమిషాల్లో అక్కడి నుంచి బయటపడ్డాడు. హత్య కోసం ఉపయోగించిన ప్రత్యేకమైన కొడుగు కత్తిని వాడిన అతను, తర్వాత వేలిముద్రలు చెరిపేసి దానిని పడవేశాడు. ఇతను కొడుకు కత్తిని ఉపయోగించడంలో ఆరితేరినవాడు.
స్వాతి హత్య పైన ఎన్నో అనుమానాలు
స్వాతి లేదా స్వాతి కుటుంబ సభ్యులకు ఎవరితోను ఆస్తి తగాదాలు లేవు. స్వాతికి శత్రువులు కూడా ఎవరూ లేరు. దీంతో ఆస్తి తగాదాల కోణం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ వ్యవహారం అయి ఉంటుందా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. అలాగే, అసలు చంపింది ఎవరు? కిరాయి హంతకుడుగా దాదాపు భావిస్తున్నారు. కాబట్టి కిరాయి హంతకుడిని పెట్టుకొని చంపించేంత ఏం ఉందనే కోణంలోను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications