ప్లాన్ ప్రకారమే ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 5 లక్షల ఫోన్ కాల్స్ విశ్లేషణ
చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్‌లో ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ ఇంజినీర్ స్వాతి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ఆమెను కేవలం పదకొండు నిమిషాల్లోనే హతమార్చి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇది వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు.
పోలీసుల దర్యాఫ్తులో రోజుకో అంశం వెలుగు చూస్తోంది. తాజాగా, సేకరించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ఆధారంగా హంతకుడు రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన సమయం, అక్కడి నుంచీ బయటకు వెళ్లిపోయిన సమయం అన్నీ లెక్కించుకుంటే కేవలం 11 నిమిషాల్లో స్వాతిని హతమార్చి పారిపోయాడని నిర్ధరించారు.
ఫాలో అయింది అతనే: ఇన్ఫోసిస్ టెక్కీ హత్యపై ఫ్రెండ్, హైదరాబాద్ సంస్థ సాయంసీసీటీవీ కెమెరా దృశ్యాల ప్రకారం హంతకుడు ఉదయం 6.31 గంటలకు రైల్వే స్టేషన్‌లోకి వచ్చాడు. స్వాతి 6.35 నిమిషాలకు స్టేషన్‌కు వచ్చింది. ఆమె రాగానే దాడి చేసి హతమార్చి పారిపోయాడు. 6.42 నిమిషాల్లో అతడు ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించాడు.
నిందితుడు పథకం ప్రకారమే ఆమెను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఆమె కోసం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిరీక్షించాడు. ఆమె రాగానే ఎదురుగా వెళ్లి పెద్దగా వాదులాడకుండానే కత్తి తీసి పొడిచేసి వెళ్లిపోయాడు. నిందితుడికి ఆమె బాగా తెలుసునని, ప్లాన్ ప్రకారమే హత్య చేశాడంటున్నారు.
కేసు దర్యాఫ్తులో భాగంగా పోలీసులు నిందితుడు వెళ్లిన దారిలో.. అన్ని ఇళ్లలో సిసిటివిలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మరో తాజా చిత్రం లభ్యమైంది. చూలైమేడు వరకు నడుచుకుంటూ వచ్చిన నిందితుడిని అక్కడ ఒక దుకాణం ముందున్న సీసీ కెమెరా చిత్రీకరించింది.

ఇందులోని హంతకుడి చిత్రాలు మరింత స్పష్టంగా ఉన్నాయి. దర్యాఫ్తుకు ఇది తోడ్పడనుంది. మరోవైపు, రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ఆటో డ్రైవర్లు కొందరు హంతకుడి చిత్రాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. చాలాసార్లు అతడు రైల్వే స్టేషన్‌లో కనిపించాడని వారు చెప్పారు.
దాంతో అక్కడ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కూడా సేకరిస్తున్నారు. మరో గుర్తు తెలియని సాక్షి కూడా నుంగంబాక్కం వద్ద హంతకుడు రైల్లో ప్రయాణించగా పలుమార్లు చూసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, పోలీసులు విచారణ కోసం నుంగంబక్కంలో పని చేసిన 5 లక్షల ఫోన్ కాల్స్‌ను విశ్లేషిస్తున్నారు.
శుక్రవారం ఉదయం హత్య జరిగిన సమయంలో ఉదయం 6 నుంచీ 7 గంటల మధ్య ఆ ప్రాంతంలో పని చేసిన సెల్‌ఫోన్ నెంబర్లను సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ రోజువారీ సంభాషణలు జరిపే ఫోన్ నెంబర్లు తీసేస్తే అనుమానాస్పదంగా ఉన్న లక్షన్నర కాల్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్వాతి ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.
మరోవైపు బెంగళూరు, మైసూర్‌లలోనూ తమిళనాడు నుంచి వెళ్లిన పోలీసు బృందాలు దర్యాప్తు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. అక్కడ ఇన్ఫోసిస్‌లో స్వాతితో పనిచేసిన వారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్వాతి కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు, దాని ద్వారా హంతకుడికి సంబంధించి కీలక సమాచారం పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications