'భర్తకు ప్రమోషన్ ఇవ్వడం కోసం తనతో గడపాలని'
లక్నో : పనితీరు కొలమానంగా జరగాల్సిన ప్రమోషన్లు.. పడక సుఖాన్ని లెక్కగడితే? సైనికులంటే సలాం కొట్టే దేశభక్తులున్న చోట.. అత్యున్నత స్థాయి అధికారాన్ని అత్యంత నీచానికి దిగజార్చిన మాజీ కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేసిన అరవింద్ రావత్ వ్యవహారమిదీ.
తాజాగా ట్రిబ్యునల్ తీర్పు ఆయనపై అభియోగాలను నిర్దారించింది. పదవీ కాలంలో కింది స్థాయి అధికారులతో ఆయన మాట్లాడిన ద్వంద్వార్థ సంభాషణ నిజమేనని తేల్చింది ట్రిబ్యునల్. పదవిలో కొనసాగిన కాలంలో కింది స్థాయి అధికారి భార్యను తన కార్యాలయానికి పిలిపించుకున్న లెఫ్టినెంట్ జనరల్ అరవింద్.. నీ భర్తకు పదోన్నతి వచ్చేలా చేసుకోవాలంటూ ద్వంద్వార్థాలతో ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. ఆరు నెలల్లోగా ఆయన వ్యవహారంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆర్మీకి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ లక్నో ధర్మాసనం ఆదేశించింది. తన భార్య పట్ల అనుచితంగా వ్యవహరించారని పేర్కొంటూ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్థన్ సింగ్, అరవింద్ రావత్ పై కేసు దాఖలు చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా హర్షవర్దన్ ఫిర్యాదు చేయడంతో.. తనకు వ్యతిరేకంగా ఓ రహస్య నివేదికను ఆయన సమర్పించారని కూడా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు హర్షవర్దన్.

మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ రావత్ తప్పు చేశారని నిర్దారించింది. జబల్ పూర్ లోని మెటీరియల్ మేనేజ్ మెంట్ కాలేజీ కమాండెంట్ గా విధుల్లో కొనసాగుతున్నప్పుడు.. హర్షవర్దన్ పిటిషన్ తొక్కిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారని తెలిపింది ట్రిబ్యునల్.
విధి నిర్వహణలో భాగంగా.. కింది స్థాయి అధికారులను కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడే అధికారం మాత్రమే రావత్ కు ఉందని, అంతే తప్ప వాళ్ల భార్యలను కార్యాలయానికి పిలిపించే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో అటు కేంద్రం, ఇటు సైన్యం.. ఓ సాటి సైనిక ఉద్యోగి గౌరవాన్ని, అతని భార్య ప్రతిష్టను కాపాడటంలో రెండూ విఫలమయ్యాయని ట్రిబ్యునల్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications