జల్లికట్టుపై ఆసక్తికరం: ఈ విషయాలు తెలుసా?
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆసక్తికరమైన కథనాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కటి చారిత్రకమైంది కాగా, రెండోది తాజా పరిణామాల నేపథ్యంలోది
చెన్నై: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆసక్తికరమైన కథనాలు వెలుగు చూస్తున్నాయి. వీటిలో ఒక్కటి చారిత్రకమైంది కాగా, రెండోది తాజా పరిణామాల నేపథ్యంలో వాదంగా ముందుకు వచ్చిన విషయం. తమిళుల సాహస కర్డీ జల్లికట్టు 3వ శతాబ్దంలోనే ఆచరణలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
అందుకు సాక్ష్యంగా శిలాఫలకాలు, నాణేలు లభ్యమైనట్లు చెబుతున్నారు. దక్షిణ భారత నాణేల పరిశీలన సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణమూర్తి 3వ శతాబ్దంలో జల్లికట్టుకు సంబంధించిన నాణేల గురించి మీడియాకు వివరించారు. తమిళనాడును మూడవ శతాబ్దంలో పాలించిన పాండ్యరాజులు సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించారని, యువతకు ఈ క్రీడలపై అవగాహన కల్పించేలా ప్రచారం కూడా చేయించారని తెలిపారు.
పొగరుబోతు కోడెలను పెంచుకొనేందుకు రాయితీ కల్పించ డంతో పాటు వాటితో పోటీపడి విజయం సాధించే వీరులకు బంగారు నాణేలను బహుమతిగా పంపిణి చేసినట్టు చరిత్ర చెపుతోందని అన్నారు. భారతదేశంలోని కొర్‌కై ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన హార్బర్ ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందని, ఇక్కడ లభ్యమయ్యే ముత్యాలను కొనుగోలు చేసేందుకు విదేశాలకు చెందిన వ్యాపారులు ఉత్సాహం చూపేవారని, ముఖ్యంగా రోమ్ నగరానికి చెందినవారు పడవల ద్వారా వచ్చివెళ్లినట్టు చరిత్ర తెలియజేస్తోందని వివరించారు.

తమ బృందం పురాతన నాణేలపై జరిపిన పరిశోధనలో జల్లికట్టుకు సంబంధించి 3వ శతాబ్దం నాటి నాణేలు వెలుగుచూసినట్లు తెలిపారు. ఈ నాణెంలో 'మా', 'ర', 'న'(మారన) అనే పేరుతో తమిళ అక్షరాలు చోటుచేసుకున్నాయన్నారు.
ఇందులో ఎద్దును అదుపుచేసే యువకుడి చిత్రం కూడా స్పష్టంగా ఉందని, దీన్ని బట్టి 3వ శతాబ్దంలోనే జల్లికట్టుతో తమిళులకు అవినావాభావ సంబంధాలున్నాయని స్పష్టమవుతుందని అన్నారు. మదురైని పాలించిన పాండ్యరాజులు విడుదల చేసిన నాణేలలో తప్పనిసరిగా మత్స్య ఆకారం వుంటుందని ఆయన చెప్పారు.
కాగా, జల్లికట్టుపై ఆసక్తికరమైన వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. జల్లికట్టు క్రీడలో బలమైన కోడెగిత్తలు ఏవో తేలవని, ఆ బలమైన కోడెగిత్తలతో ఆవులను కలిపేవారని, దానివల్ల బలమైన ఆరోగ్యకరమైన పశుసంపద వర్ధిల్లేదని చెబుతున్నారు. దానికోసమే జల్లికట్టు ప్రారంభమైందని అంటున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో, అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో సంప్రదాయ పాడి ఉత్పత్తులను దెబ్బ తీయడంలో భాగంగానే జల్లికట్టును నిషేధించాలనే వాదన ముందుకు వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications