యాడ దొరికిన సంతరా ఇది- డస్ట్ బిన్లతో కొట్టుకున్న వందే భారత్ సిబ్బంది
ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ వెళ్లే నంబర్ 22470 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ ప్రయాణికులను షాక్ కు గురిచేసింది. రైలు బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు జరిగిన ఈ సంఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ గొడవ రైల్వే ప్రతిష్ట, వందే భారత్ ప్రీమియం సేవలకు చెడ్డ పేరు తెచ్చినట్టయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఈ గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 1:19 నిమిషాల నిడివి గల వీడియో ఇది. సిబ్బంది డస్ట్‌బిన్‌లు, బెల్టులు, పిడికిళ్లతో కొట్టుకుంటున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తోన్నారు. ఇలాంటి ప్రవర్తన గల ఉద్యోగులు రైల్వేలో ఉద్యోగం చేయడానికి అనర్హులు అని చెబుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. వారిని విధుల నుంచి అప్పటికప్పుడే బర్తరఫ్ చేయాలని సలహా ఇస్తోన్నారు.

నిజాముద్దీన్ రైల్వే స్టేషన్న ప్లాట్ ఫామ్ పై ఒకవంక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిల్చుని ఉండగా.. మరోవంక ఎనిమిది మంది సిబ్బంది గొడవపడటం ఈ వీడియోల్లో స్పష్టంగా చూడొచ్చు. బెల్టులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. డస్ట్‌బిన్లను సైతం విసురుకోవడం కనిపించింది. కిందపడ్డా వెనక్కి తగ్గలేదు. మళ్లీ మళ్లీ పైకి లేస్తూ గొడవ పడ్డారు. దీన్నంతటినీ ప్రయాణికులు దూరంగా ఉండి చూశారు. మరికొందరు తమ సెల్ ఫోన్ లో దీన్ని వీడియో తీశారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జోక్యం చేసుకున్నప్పటికీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సిబ్బంది వినేదు. వారి ముందే కొట్టుకున్నారు. తోసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది. లక్షమందికి పైగా యూజర్లు దీన్ని వీక్షించారు. దానికి తగ్గట్టే రిప్లైలు కూడా పోస్ట్ అయ్యాయి. ఆ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తూ రిప్లైలు పెట్టారు.
IRCTC staffers serving onboard Vande Bharat settle an altercation with dustbin, belt and punches at Nizamuddin station in Delhi. pic.twitter.com/tldenRsRMz
— Piyush Rai (@Benarasiyaa) October 17, 2025
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గొడవ పడ్డ వారిలో నలుగురిని ఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై IRCTC అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, వారి ఐడీ కార్డులను ఇనాక్టివ్ చేశామని, విధుల్లోంచి తొలగించినట్లు తెలిపింది. క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ కు అయిదు లక్షల జరిమానా విధించినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications