వెనెజులాకు ఒడిషా పాఠాలు..! నవీన్ పట్నాయక్ శిష్యుడి ఘనత..!
2013లో ఒడిశాను భారీ తుపాన్ కుదిపేసింది. రాత్రికి రాత్రి దాదాపు కోటి మంది ప్రజల్ని అప్రమత్తం చేసి తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, లేకపోతే భారీ ప్రాణనష్టం తప్పదు. అప్పట్లో సీఎం నవీన్ పట్నాయక్ కు ఓఎస్డీగా ఉన్న తమిళనాడు ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ (VK Pandian) రంగంలోకి దిగారు. తన అసాధారణ నిర్ణయాలతో ఒడిశాలో ఆ తుపాన్ ధాటికి ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడారు. ఈ ఆపరేషన్ ను అప్పట్లో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రశంసించింది.
నవీన్ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్ (VK Pandian)
అప్పట్లో భారీ తుఫాన్ బారి నుంచి కోటి మంది ప్రజల్ని కాపాడిన వీకే పాండియన్ ప్రతిభాపాటవాలకు మెచ్చి నవీన్ పట్నాయక్ ఓ దశలో ఆయన్ను తన పార్టీ బీజేడీకి వారసుడిగా ప్రకటిద్దామని కూడా భావించారు. కానీ పార్టీలో నాయకుల వ్యతిరేకత వల్ల ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు. అయినా వీకే పాండియన్ తెచ్చుకున్న మంచి పేరు మాత్రం ఆయన్ను ఇప్పటికీ ఎక్కడికెళ్లినా గుర్తింపు తెచ్చిపెడుతూనే ఉంది. తాజాగా భారీ భూకంపాలతో అల్లాడిన వెనెజులా (Venezuela) సైతం వీకే పాండియన్ ను గుర్తుచేసుకుంది.

భూకంప వెనెజులాకు ఒడిషా పాఠాలు
భూకంపం అనంతరం దేశాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, ప్రజలకు తిరిగి మామూలు జీవితం అందించేందుకు వీకే పాండియన్ సాయాన్ని వెనెజులా కోరింది. దీంతో ఆయన కూడా సంతోషంగా వెనెజులా వెళ్లారు. వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను కలిసి, సహాయక, పునరుద్ధరణ, పునరావాసంపై ఒడిశా, భారతదేశం నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ వారం భూకంప ప్రభావిత వెనిజులాలో పర్యటించి, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను కలిసినట్లు పాండియన్ తెలిపారు. విపత్తు నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

జీరో క్యాజువాలిటీ విధానం
జూన్ 24న వెనిజులాలో వచ్చిన జంట భూకంపాల కారణంగా కనీసం 3,889 మంది చనిపోయారు. 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన ఈ రెండు భూకంపాలలో దాదాపు 17వేల మంది గాయపడగా, మరో 18వేల మంది నిరాశ్రయులయ్యారు. గత 13 ఏళ్లుగా తుఫానులు తరచుగా వచ్చే ఒడిశాకు పాండియన్ నాయకత్వం వహించడం, విపత్తు నిర్వహణ నిపుణుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 52 ఏళ్ల పాండియన్ 2013లో నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఒడిశా తీరాన్ని తరచుగా తాకే తుఫానుల్ని ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్రం రూపొందించిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'జీరో క్యాజువాలిటీ' (ప్రాణనష్టం లేని) విపత్తు నిర్వహణ వ్యూహాన్ని సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శాస్త్రీయ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, సామాజిక సమీకరణను, వికేంద్రీకృత నిర్ణయాధికారాన్ని కలపడం అనే ఆయన విధానం, విపత్తు నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాణంగా నిలిచింది. ఇప్పుడు అదే ఆయన్ను వెనెజులా సలహాలు ఇచ్చే స్దాయికి తీసుకెళ్లింది.













Click it and Unblock the Notifications