మహిళలపై వేధింపులు: అడ్డుకున్నందుకు రాడ్‌తో కొట్టిచంపారు
కోల్‌కతా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తున్న కొందరు దుండగులను అడ్డుకున్న ఓ యువకుడిపై వారు దాడి చేశారు. ఈ ఘటన ఐదు రోజుల క్రితం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హౌరాలో చోటు చేసుకుంది.
ఇనుప రాడ్లతో కొట్టడంతో అతడు తీవ్రగాయాలపాలైన యువకుడు అరూప్ భండారి(24) ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హుగ్లీ నది సమీపంలో సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించిన ప్రజలు అనంతరం విగ్రహ నిమజ్జనం చేస్తున్నారు.

ఆ సమయంలో కొందరు దుండగులు అక్కడికి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలపై వేధింపులు ఆపాలని అరూప్, అతడి స్నేహితుడు కలిసి ఆ దుండగులను హెచ్చరించారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు ఇనుప రాడ్లతో అరూప్, అతని స్నేహితుడిపై దాడి చేశారు.
విచక్షణా రహితంగా అరూప్ తలపై బాదారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు.
తీవ్ర గాయాలపాలైన అరూప్ భండారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అరూప్ కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ అతడు సోమవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు, ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.
కాగా, తాము ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు మొదట స్వీకరించలేదని... ఆందోళన చేయడంతోనే కేసు నమోదు చేశారని అరూప్ బంధువులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications