కింగ్ మేకర్ ఎంజీపీ: ఆల్‌రెడీ బీజేపీ కర్చీఫ్ వేసేసిందిగా: మంతనాలు షురూ
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అంటూ దేశ ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకో రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం గురువారం బహిర్గతం కానుంది. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ వాటిని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి 21 సీట్లు అవసరం. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియాటుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం- కాంగ్రెస్ 15 నుంచి 20, బీజేపీ-14 నుంచి 18 స్థానాలు దక్కుతాయని స్పష్టమైంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 2 నుంచి 5, ఇతరులు నాలుగు స్థానాలు వరకు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తుందని తేలింది.
గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటమంటూ జరిగితే- మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే- ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఈ పరిస్థితిని బీజేపీ ముందే పసిగట్టినట్టుంది. అందుకే- ఎంజీపీతో మంతనాలు సైతం మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎంజీపీ అధినేత దిలీప్ ధవలీకర్‌తో సంప్రదింపులు ప్రారంభించారు.

ప్రమోద్ సావంత్.. ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన మరుసటి రోజే ఆయన ఢిల్లీలో అడుగు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆయన కలుసుకోనున్నారు. హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే- గోవాలో ఎలాంటి వ్యూహాలను పన్నాల్సి ఉంటుందనే విషయంపై వారితో చర్చించనున్నారు.
Recommended Video
హంగ్ అసెంబ్లీ ఏర్పడితే- ఎంజీపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎంజీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులను కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీని సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. అయినప్పటికీ- హంగ్ ఏర్పడితే కాంగ్రెస్‌ను నిలువరించడానికి ఎంజీపీ సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications