ఇస్రో కౌంట్‌డౌన్- చంద్రుడిపైకి రాకెట్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగించే తేదీని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తాజా ప్రకటన చేశారు. ఈ నెల 13వ తేదీన ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశిత గడువు నాడు వాతావరణం అనుకూలించకపోతే రెండో ఆప్షన్ కింద 19వ తేదీని ఖరారు చేసినట్లు చెప్పారు. 13వ తేదీ నాడే చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించడానికి అన్ని ఏర్పాటు చేస్తోన్నామని అన్నారు.

ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్‌ను మోసుకెళ్లడానికి జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3ని వినియోగించనుంది ఇస్రో.
రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే తమ ప్రయత్నమని సోమనాథ్ వివరించారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు పునరావృతం కానివ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోన్నామని చెప్పారు. గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది.
చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది. ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని విజయవంతంగా పరీక్షించారు. 25 నిమిషాల పాటు దాన్ని మండించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో టెస్ట్ ఫైర్ ఇదివరకే పూర్తయింది.












Click it and Unblock the Notifications