కోరిక నెరవేరింది: శ్రీహరి కోటలో నరేంద్ర మోడీ
నెల్లూరు: శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరేళ్ల కంది కోరిక సోమవారం నెరవేరింది. 2008లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్టోబర్ 22న షార్‌లో చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతంగా జరిగింది. దాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దొరక్కపోవడంతో మోడీ.. అహ్మదాబాద్‌లోని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్లారు.
చంద్రయాన్-1 విజయంలో భాగస్వాములైన అక్కడి శాస్త్రవేత్తలను అభినందించారు మోడీ. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైందని, ఇది మరపురాని రోజనీ శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రయోగాలతో భారత కీర్తి పతాక అంతర్జాతీయంగా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. చంద్రయాన్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నానని, తనకు అవకాశం దొరకలేదని చెప్పారు.

శ్రీహరికోటను ఎప్పటికైనా చూడాలని అన్నారు. తినడానికి తిండిలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్న ఈ దేశంలో అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అనుకున్నానని.. వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు తెలుసుకున్నానని తెలిపారు. ఈ ప్రయోగాల వల్ల సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేపలు ఎక్కడ ఉన్నాయో, వారు ఎక్కడ చేపల వేటలో ఉన్నారో సులభంగా తెలుసుకుంటున్నామని తెలిపారు. దీంతో మత్స్యకారుల జీవనశైలి మారిపోయిందని చెప్పారు.
భూమిలోపల ఖనిజాల లభ్యతను తెలుసుకునే వీలు కలిగిందని మోడీ చెప్పారు. ఎడ్యూశాట్ ఉపగ్రహం ద్వారా లక్షల మంది విద్యార్థులు తమకు తెలియని విషయాలను తెలుసుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విజయాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిపాలనా వ్యవహారాలకు అంతరిక్ష ప్రయోగాలపైనే ఆధారపడేవారు. రిమోట్ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్స్ ఉపగ్రహాలపై ఆధారపడి గుజరాత్‌లో కొత్త కొత్త పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు.
కాగా, శ్రీహరికోటలోని షార్ నుంచి పిఎస్ఎల్‌వి-సి23 సోమవారం ఉదయం 9.52 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిరంతరాయంగా 49గంటలపాటు కొనసాగింది. ఈ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నర్సింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, జితేంద్రసింగ్ తదితరులు ప్రత్యక్షంగా వీక్షించారు.












Click it and Unblock the Notifications