నటన కన్నా రాజకీయానికే ప్రాధాన్యం: ఎంపి చిరాగ్
న్యూఢిల్లీ: నటన కన్నా రాజకీయ జీవితానికే తాను ప్రాధాన్యత ఇస్తానని పార్లమెంటుసభ్యుడు, బాలీవుడ్ నటుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈయన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు.
గురువారం చిరాగ్ మాట్లాడుతూ.. ‘నటన అనేది ఒక అంశానికి సంబందించినది. నటనపై ఉన్న మక్కువతో ఆ కోరికను తీర్చుకున్నా. కానీ ఇప్పుడు నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. రాజకీయమే నాకు సరైన వేదిక. దీనినే చివరి వరకు కొనసాగిస్తా' అని ఎంపి చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

తాను రాజకీయాలను అంత తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు. తనకు పార్టీలోని సీనియర్ నాయకులు పూర్తిగా తమ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఇక తన జీవితంలో రాజకీయానికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్.. జమూయి లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన 2011లో ‘మిలేనా మిలేహం' అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి తన్వీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, చిరాగ్ సరసన నటి కంగనా రనౌత్ నాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలుకావడంతో మళ్లీ ఆయన బాలీవుడ్‌లో అడుగుపెట్టలేదు.












Click it and Unblock the Notifications