నరేంద్ర మోడీ వినాశకరం: ప్రధాని, కేజ్రీవాల్ పార్టీ పైనా
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశానికి వినాశకరం అన్నది తన అభిప్రాయమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం అన్నారు. గుజరాత్‌లో జరిగిన మారణకాండ మరోసారి ఈ దేశంలో జరగాలని కోరుకోవడం లేదన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని మాట్లాడారు. గత పదేళ్లలో ప్రధానిది ఇది మూడో ప్రెస్ కాన్ఫరెన్స్.

ఇప్పుడున్న మీడియాతో పోలిస్తే చరిత్రకారులు తన పట్ల సున్నితంగా వ్యవహరిస్తారని భావిస్తానని ప్రధాని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నంత వరకు సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పారు. కేబినెట్లో జరిగిన చర్చల వివరాలను మీడియా సమావేశంలో చెప్పలేనని తెలిపారు. తనకు కాంగ్రెసు పార్టీ నుండి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఎప్పుడూ అనూహ్య మద్దతు లభించిందన్నారు.
పదేళ్లలో ఎప్పుడూ కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వం మధ్య విభేదాలు రాలేదన్నారు. రెండు అధికార కేంద్రాలున్నాయన్నది అవాస్తవమన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు ఉంటాయన్నది వాస్తవమన్నారు. 2014 ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి యూపిఏ నాయకత్వం వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అవినీతిపై తనను ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదన్నారు.
కేజ్రీవాల్ పార్టీ పైన
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అవినీతి ప్రధానమైన అంశమని, దీనిని కేజ్రీవాల్ ప్రజల ముందు సమర్థవంతంగా ఉంచారన్నారు.












Click it and Unblock the Notifications