కాంగ్రెస్ బంపర్ ఆఫర్- విలీనానికి తయ్యార్..?!
Ghulam Nabi Azad: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జమ్మూ కాశ్మీర్. దశాబ్దకాలం తరువాత ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. తొలి దశలో పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు సెప్టెంబర్ 18వ తేదీన ఓటింగ్ జరుగనుంది. గందర్‌బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లో గల 26 స్థానాలకు సెప్టెంబర్ 25న రెండో దశలో పోలింగ్ ఉంటుంది.

అక్టోబరు 1వ తేదీన చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లో 40 సీట్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, సీపీఎం ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నాయి.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, ఏడు ఎస్సీ, తొమ్మిది ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్‌డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 44,46,000 వేల మంది పురుషులు, 42, 62,000 మంది మహిళలు ఉన్నారు. 3.71 లక్షల మంది మొదటి సారిగా ఓటు వేయనున్నారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు మించి సత్తా చాటింది. అయిదు లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ, ఇండియా భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు చొప్పున సీట్లల్లో విజయం సాధించాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
ఈ పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా పార్టీ రాజీనామా చేసి వెళ్లిన గులాం నబీ ఆజాద్‌ను మళ్లీ రప్పించుకునే ప్రయత్నాల్లో పడింది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి గనక అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.
అదే జరిగితే గులాం నబీ ఆజాద్‌కు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవులను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆజాద్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఆయన పెట్టే షరతులకు అంగీకరించితే- ఆజాద్ చేరిక లాంఛనప్రాయమే కావొచ్చు.
2022లో ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లోని ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. దీన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను సైతం కొట్టిపారేయట్లేదు విశ్లేషకులు.












Click it and Unblock the Notifications