Jantar Mantar Protest: 35 వేల మంది పోలీస్ ఫోర్స్, జైళ్లుగా మారిన స్టేడియంలు
దేశ రాజధాని ఢిల్లీ శనివారం ఉదయాన్నే కన్నుతెరిచేసరికి ఒక యుద్ద ప్రాంగణాన్ని తలపించింది. కాక్రోచ్ జనతా పార్టీ , ప్రతిపక్ష 'ఇండియా' కూటమి.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరమంతటా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటైంది. 'జంతర్ మంతర్ 2.0' పేరుతో తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, వేలాది మంది నిరసనకారులు తరలివచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర హోంశాఖ ఆజ్ఞల మేరకు బలగాలు రాజధానిని తమ అదుపులోకి తీసుకున్నాయి.
పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు నగరవ్యాప్తంగా ఏకంగా 35,000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు, కేంద్రీయ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు మోహరించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. మండి హౌస్, ఫిరోజ్ షా రోడ్డు, జనపథ్ వంటి కీలక ప్రాంతాల్లో బహుళ అంచల ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజా రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీ మెట్రో పరిధిలోని 57 ప్రధాన స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు.

సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఢిల్లీలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉండగా, పక్కనే ఉన్న నోయిడాలో కూడా అక్టోబర్ 20 వరకు సెక్షన్ 163 విధించి సరిహద్దుల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.
#WATCH | Delhi Police personnel use body cameras on their uniform as they are deployed for security ahead of the CJP protest today. These body cameras work even in the dark. A Police personnel says, "These body cams are to protect us and others. In situations of manhandling, allegations are levelled against Delhi Police. So, these body cams will prove whether we did anything to anyone or not. This will record eveything..."
— ANI (@ANI) October 10, 2026
వివాదాలకు తావులేకుండా బాడీ కెమెరాలు.. రక్షణగా 'పింక్ ఫోర్స్'
ఈసారి పోలీసులు సరికొత్త భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నిరసనకారుల పట్ల, పోలీసుల పట్ల ఎలాంటి ఘర్షణలు, తప్పుడు ఆరోపణలు రాకుండా ఉండేందుకు విధుల్లో ఉన్న సిబ్బందికి యూనిఫామ్‌పై అమర్చే ప్రత్యేక 'బాడీ క్యామ్‌లు' ఇచ్చారు. చీకటిలో కూడా స్పష్టమైన వీడియో రికార్డింగ్ చేసే సామర్థ్యం వీటికి ఉంది. గతంలో మహిళా పోలీసులపై జరిగిన వేధింపుల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రత్యేకంగా 'పింక్ ఫోర్స్' అనే మహిళా పోలీసల్ని ముందువరుసలో రంగంలోకి దించారు. అలాగే తప్పుడు వీడియోల ప్రచారానికి ఆస్కారం ఇవ్వకుండా, నిరసనకారులతో వాగ్వాదానికి దిగొద్దని అధికారులకు ఆదేశాలు అందాయి.
#WATCH | Delhi: Pink Force of the Delhi Police deployed for security, ahead of the CJP protest today. They are being deployed in wake of the recent incidents of misbehavior with women Police personnel. https://t.co/OBOMV0oZgA
— ANI (@ANI) October 10, 2026
సరిహద్దుల్లోనే అరెస్టులు.. తాత్కాలిక జైళ్లుగా స్టేడియంలు
ఎక్కడ నిరసనలకు దిగినా లేదా గుమిగూడేందుకు ప్రయత్నించినా ప్రదర్శనకారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమీషనర్ ఆదేశించారు. అదుపులోకి తీసుకున్న వారిని తరలించేందుకు ఛత్రసాల్, రాజీవ్ గాంధీ స్టేడియంలతో సహా ఆరు కమ్యూనిటీ సెంటర్లు, క్రీడా ప్రాంగణాలను తాత్కాలిక జైళ్లుగా మార్చారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆయుధాలు ధరించకూడదని, కేవలం లాఠీలతో శాంతిభద్రతలను కాపాడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచే కనాట్ ప్లేస్, జనపథ్ ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి, పలువురు నిరసనకారులను పోలీసు వాహనాల్లో తరలించారు.
#WATCH | Delhi Police detain a few protesters who had started gathering at Jantar Mantar for the Cockroach Janta Party (CJP) protest here. https://t.co/QqZtF4Jswd
— ANI (@ANI) October 10, 2026
"ఇది కేంద్రం నిరంకుశత్వం"
మరోవైపు ఈ అణచివేతపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరే ముందు సీజేపీ నాయకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ యువతను చూసి భయపడుతున్నారని, దేశంలో ఎమర్జెన్సీ లాంటి వాతావరణం సృష్టించారని ఆరోపించారు. "శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 19 మనకు ఉంది. దాన్ని అడ్డుకునేందుకు రైళ్లు, మెట్రోలు బంద్ చేయడం దారుణం" అని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద అరెస్టయిన ఒక మహిళా నిరసనకారిణి మాట్లాడుతూ, "జంతర్ మంతర్ భారతదేశ ప్రతిఘటనకు నిదర్శనం. మా రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికే రోడ్డెక్కాం" అని పేర్కొనడం ఈ ఆందోళన తీవ్రతకు అద్దం పడుతోంది.













Click it and Unblock the Notifications
