రావణుడితో వీరోచిత పోరాటం.. 'జటాయు' కూలిన చోటు ఇదే.. ఎలా చేరుకోవాలి..?
ఇటీవల 'రామాయణ' మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది శ్రీ రాముడు జన్మస్థలం, సీతాదేవి జన్మస్థలం, అయోధ్య, సీతాపహరణం, జటాయువు వీరమరణం చెందిన చోటు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతాలను ఓ సారి చుట్టేసేందుకు పర్యటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తున్న సమయంలో పక్షిరాజు జటాయువు ప్రాణాలకు తెగించి రావణుడితో పోరాటం చేస్తాడు. జటాయువు.. రావణుడిని తీవ్రంగా గాయపరుస్తుంది.
అయితే రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికివేశాడు. దాంతో రెక్కలు తెగిపోయిన జటాయువు రక్తసిక్తమై పంచవటి అటవీ ప్రాంతంలో నేలకొరుగుతాడు. అలా రాముడి కోసం ఎదురు చూసి.. సీతమ్మను రావణుడు దక్షిణ దిశగా ఎత్తుకెళ్లాడని కీలక సమాచారాన్ని అందిస్తాడు. ఆ తర్వాత రాముడి చేతుల్లోనే మరణిస్తాడు. ఇక శ్రీరాముడు స్వయంగా గోదావరి నదీ తీరంలోనే జటాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వహించి మోక్షం ప్రసాదించాడు.
రామాయణంలో ఈ ఘట్టాలకు సంబంధించి గోదావరి తీరంలోని నాసిక్ ప్రాంతంతో పాటు కేరళలోని జటాయు ఎర్త్ సెంటర్ కూడా ప్రసిద్ధి చెందింది. కేరళలోని తిరువనంతపురానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందాయమంగళంలో జటాయు ఎర్త్స్ సెంటర్ ను నిర్మించారు. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాతి కొండపై ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం ఉంది. ఇక్కడ 200 అడుగుల పొడవు.. 150 అడుగుల వెడల్పు.. 70 అడుగుల ఎత్తులో ప్రధాన ఆకర్షణగా ఈ పక్షి శిల్పం నిలుస్తోంది. మహిళల భద్రత, గౌరవానికి సూచికగా ఈ భారీ శిల్పాన్ని నిర్మాణం చేశారు. దీన్ని 2017 లో ప్రారంభించారు.

ఈ భారీ శిల్పం వద్దకు చేరుకోవాలంటే దాదాపు 800 లకు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలాగే నడవలేని వారికోసం కేబుల్ కారు సదుపాయం కూడా ఉంది. ఇక జటాయువు పక్షి శిల్పం లోపలి భాగంలో మల్టీ లెవెల్ డిజిటల్ మ్యూజియం, 6 డీ థియేటర్ అలాగే ఆడియో- విజువల్ గ్యాలరీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ రాక్ క్లైంబింగ్, ర్యాపెలింగ్, జిప్- లైనింగ్ తో పాటు పెయింట్ బాల్ వంటి 20 కు పైగా క్రీడలు ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications
