అమ్మ, స్టాలిన్, క్యాప్టెన్ ఎన్నికల ఖర్చు ఎంతంటే !
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల లెక్కల్ని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత, డీఎంకే చీఫ్ కరుణానిధి, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ తో సహ పలువురు ప్రముఖుల ఎన్నికల ఖర్చుల వివరాలు వెల్లడించారు.
2016లో జరిగిన తమిళనాడు శాసన సభ ఎన్నికలు ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. మొత్తం 234 శాసన సభ స్థానాల్లో రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
బరిలో అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకేతో పాటు ఇతర పార్టీల నేతలు పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఎంత ఖర్చు చేశారు అని ఈసీ దృష్టి పెట్టింది. ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పాలని ఈసీ పోటీ చేసిన అభ్యర్థులకు సూచించింది.

అమ్మ ఖర్చు రూ. 24. 55 లక్షలు
జయలలిత చెన్నై నగరంలోని ఆర్ కే నగర్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల ఖర్చు రూ. 24, 55, 631 చూపించారు. ఆర్ కే నగర్ నుంచి విజయం సాధించిన జయలలిత సీఎం అయ్యారు.

కురవృద్దుడు కరుణ
తిరువారూర్ నియోజక వర్గం నుంచి కురవృద్దుడు కరుణానిధి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఎన్నికల ఖర్చు రూ. 25 లక్షలు చూపించారు.

ప్రతిపక్ష నాయకుడు
తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకడు స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తన ఎన్నికల ఖర్చును రూ. 25 లక్షలు చూపించారు.

అయ్యో పాపం క్యాప్టెన్
తానే సీఎం అవుతాననే ఆశతో ఉలందూరు నుంచి ఎన్నికల బరిలో దిగిన డీఎండీకే అధినేత, క్యాప్టెన్ విజయ్ కాంత్ తన ఎన్నికల ఖర్చు రూ. 16,70 లక్షలు చూపించారు. రూ. 25 లక్షల్లో మిగిలిన సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే గెలిచేవారని ప్రత్యర్థి రాజకీయ నాయకులు వ్యంగంగా అంటున్నారు.

పీఎంకేది అదే స్టైల్
పీఎంకే అధినేత అన్బుమణి రాందాస్ తానే సీఎం అంటూ ఎన్నికల బరిలో దిగారు. ఆయన తన ఎన్నికల ఖర్చు రూ. 19 లక్షలు చూపించారు.

80 ఓట్లతో ఓడినా
వీసీకే నేత తిరుమావళవన్ కాట్టుమన్నార్ నుంచి పోటీ చేసి 80 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన తన ఎన్నికల ఖర్చు రూ. 15 లక్షలు అని ఈసీకి సమాచారం ఇచ్చారు.

అన్నీ కాకిలెక్కలే
ఈసీ ఆదేశాల ప్రకారం ఒక్కో అభ్యర్థి రూ. 25 లక్షలకు మించి ఖర్చు చెయ్యరాదు. ఎన్నికల్లో పోటీ చేసి రూ. కోట్లు ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. అయితే ఈసీకి లెక్క చెప్పే సమయానికి రూ. 25 లక్షలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications