అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ బ్రదర్స్: తాడిపత్రిలో కర్ర పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

జేసీ బ్రదర్స్... తెలుగు రాజకీయాలు గమనిస్తున్న వాళ్లందరికీ బాగా పరిచయమున్న పదబంధం. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం.

రాయలసీమలో పేరున్న ఫ్యాక్షనిస్టు కుటుంబాల పేర్లు చెప్పమంటే మొదటి మూడు పేర్లలో జేసీ బద్రర్స్ పేరు ఉంటుంది.

రాష్ట్రంలో మూడు, నాలుగు దశాబ్దాలుగా ఒక నియోజకవర్గంలో ప్రభావం చూపించిన ఫ్యాక్షనిస్టు కుటుంబాలు బాగా తక్కువ. మూడు నాలుగు కుటుంబాలకంటే ఎక్కువ వుండవేమో. అందులో జేసీ బద్రర్స్ కుటుంబం ఒకటి.

ఈ కుటుంబం పట్టు తాడిపత్రి నియోజకవర్గం మీద ఎంతగా బలంగా ఉంటుందంటే 1985 నుంచి 2019 దాకా ఈ ప్రాంతంలో వాళ్లని ఎదుర్కొన గలిగే ప్రత్యర్థే రాలేదు. ఇంత పట్టు ఎలా వచ్చిందని అడిగితే, తాడిపత్రిలో ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెబుతారు.

జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చే ఎంట్రీలన్నీ కూడా గొడవలు, అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు, సవాళ్లు, హెచ్చరికలు, కేసులు, బస్సుల సీజ్, సంచలన ప్రకటనలే.

ఒకప్పుడు బాంబులు, కత్తులు, రక్తపాతానికి, పెత్తనానికి, అధిపత్యానికి ఈ రెండు పేర్లను పర్యాయపదంగా చెప్పుకునే వాళ్లు.

తెలుగు పత్రికల్లో, వాళ్లు ప్రాతినిధ్యం వహించిన తాడిపత్రి గురించిన వార్తలు చూస్తే ఫ్యాక్షన్ రాజకీయాలకు అది ముఖ్య పట్టణం అనే భావన కలుగుతుంది.

అందుకే జేసీ బద్రర్స్ 'టెర్రర్' న్యూస్ రాసేందుకు తెలుగు మీడియా ఉబలాటపడుతుంది. చదివేందుకు తెలుగు పాఠకులు ఇష్టపడతారు.

జేసీ బద్రర్స్ గురించి రాసే ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. సంచలన కోణం లేకుండా వాళ్ల గురించిన వార్తలెక్కడా కనిపించవు. వాళ్ల ప్రకటనలను పిండి పిండి మీడియా సంచలనం సేకరిస్తుంది.

2019 తర్వాత జేసీ బ్రదర్స్ పెద్దగా వార్తల్లో లేరు. ఎవరితో మాట్లాడినా రాయలసీమలో కనుమరుగవుతున్న రాజకీయ కుటుంబాల్లో జేసీ బ్రదర్స్ ఒకటని కూడా ఉదహరిస్తారు.

ప్రాభవం తగ్గిందా?

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాకతో తాడిపత్రి మీద జేసీ బద్రర్స్ పట్టు సడలడం మొదలయింది. 2019 ఎన్నికల్లో జేసీ బదర్స్ వారసులు తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో గాని, అనంతపురం లోక్‌సభ ఎన్నికల్లో గాని గెలవలేదు. వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు.

ఇది మామూలు పరాజయం కాదు, ఫ్యాక్షన్, రాజకీయ వైరంతో కసి మీద ఉన్న వై.ఎస్. కుటుంబం చేతిలో పరాజయం. అందుకే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అధ్యాయం ముగిసిందని చెబుతారు.

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, జేసీ బ్రదర్స్ రాజకీయాలే కాదు, ఆర్థికాధిపత్యం కూడా పతనావస్థకు చేరుకుంది.

ఇంకా చెప్పాలంటే జేసీ బ్రదర్స్ ప్రాభవం మసక బారడం 2004లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తిరుగులేని శక్తి కావడంతోనే మొదలైంది. జేసీ దివాకర్ రెడ్డిని వై.ఎస్. మంత్రిగా కొనసాగనీయలేదు. అయితే, ఏ మాటకామటే చెప్పుకోవాలి. వైఎస్-జేసీ వైరం ఎపుడూ మర్యాద మీరలేదు.

రాష్ట్ర విభజన తర్వాత వీరు టీడీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. వారికి టీడీపీలో కూడా ఆశించినంత ప్రాముఖ్యం రాలేదు. అయితే, వై.ఎస్. కుమారుడు జగన్ అధికారంలోకి రావడంతో జేసీ బద్రర్స్ టీడీపీలోనే కొనసాగాల్సి వస్తోంది.

జగన్ అధికారంలోకి వచ్చాక వాళ్లు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు గతంలో ఎపుడూ వచ్చి ఉండవు.

నియోజకవర్గం ఆర్థిక వనరుల మీద ఈ కుటుంబం గుత్తాధిపత్యం చేజారిపోతున్నది. ప్రధాన వనరు 'దివాకర్ ట్రావెల్స్' ఆగిపోయింది. ఇతర వ్యాపారాలు సన్నగిల్లాయి. కొన్నింటి మీద కేసులు నడుస్తున్నాయి.

దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయి కడప సబ్ జైలులో గడపాల్సి వచ్చింది. ఆ పైన కరోనా సోకింది. ఇటు వయసు కూడా పైబడింది.

కొడుకులకు పగ్గాలిచ్చి తెర వెనకకు వెళ్లాలనుకున్న జేసీ బద్రర్స్ కోరిక తీరలేదు. నేపథ్యంలో ఈ మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మునిసిపాలిటి టీడీపీ వశమయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు.

రాష్ట్రమంతా సాగిన జగన్ జైత్ర యాత్రకు తాడిపత్రిలో బ్రేక్ పడింది. ఇది జేసీ బ్రదర్స్ 2.0 ప్రస్థానానికి దారితీస్తుందా? లేక నియోజకవర్గంలో పట్టు పూర్తిగా సడలిపోలేదు అని చెప్పుకోవడాకే సరిపోతుందా అనే ప్రశ్న ఉన్నది.

ఇలాంటి కక్షా రాజకీయ నేపథ్యంలో తాడిపత్రి నుంచి పచ్చని, పరిశుభ్రమయిన, మురుగుల కాల్వల దుర్వాసన లేని ప్లాస్టిక్ వాసన అంటని వార్తలు వూహించగలమా? కష్టమే. కానీ అదే నిజం.

తాడిపత్రి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మునిసిపల్ పాలనకు సంబంధించి అద్భుతమైన విజయగాథ. కాకపోతే, అది అంతగా ప్రచారానికెక్కలేదు. పరిశోధకుల కంటపడింది గాని, రాజకీయ కారణాల వల్ల తాడిపత్రి సక్సెస్ స్టోరీకి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదు.

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం

తాడిపత్రిలో కొత్త ప్రయోగం-మొక్కలకు చదువుకు లంకె...

ఇపుడు తాడిపత్రి మునిసిపాలిటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఈసారి 'ప్లాంట్-ఎజుకేట్' నినాదంతో ముందుకు పోవాలనుకుంటోంది. ఈ మార్చి ఎన్నికలలో ఏర్పడిన కొత్త మునిసిపాలిటీ గతంలో సాధించిన విజయాలను మరొక మెట్టు పైకి తీసుకెళ్లుతున్నది.

''ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలి. పెంచాలి. రోజు పొద్దున్నే పళ్లు తోముకుంటూ పుక్కిలించినా ఆ నీళ్లతో అది చిగురిస్తుంది. దీనికి ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థి ఏ సబ్జక్టులో బలహీనంగా ఉంటే దాంట్లో మేం నిపుణులతో ఉచితం కోచింగ్ ఇప్పిస్తాం'' మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు.

అలాగే బాలికలకు, గృహిణులకు కూడా మరొక ఏర్పాటు వుంది. వాళ్లు చెట్లు నాటి పోషిస్తే వాళ్ల కోసం ఓకేషనల్ క్లాసులు ఏర్పాటు చేస్తాం. కుకింగ్, బేకరీ, బ్యూటీషియన్ వంటి రంగాల్లో నిపుణులను పిలిపించి వాళ్లకు ట్రైనింగ్ ఇప్పిస్తాం'' అన్నారు ప్రభాకర్ రెడ్డి.

"ఈ పథకం అమలు చేసేందుకు ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎవరైనా చేరవచ్చు. ఫోన్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ కాలేజీ దాకా విద్యార్థులెవరైనా చేరవచ్చు. అయిదేళ్ల నుంచి యాభైయేళ్ల వరకు ఏ వయసు వారయినా చేరొచ్చు. చేయాల్సిందంతా మొక్కలు నాటడం, అవి పెద్దగయ్యేలా చూడటమే'' అని అంటున్నారు ప్రభాకర్ రెడ్డి.

ఈ క్యాంపెయిన్ కు తెలంగాణ హరిత హారాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. హరితహారం పాటలనే తీసుకుని తెలంగాణ స్థానంలో తాడిపత్రిని జోడించి రికార్డు చేశారు.

'గో గ్రీన్ తాడిపత్రి' పర్యవేక్షణ బాధ్యతను ఆయన కౌన్సిలర్లకు ఇస్తున్నారు. ఇరవై మందికి సొంత ఖర్చులతో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తున్నారు. వారు స్కూటర్లు మీద తిరుగుతూ ఊర్లో నాటిన చెట్ల బాగోగుల మీద నిఘా వేస్తారు.

తాడిపత్రి విజయగాథ

అనంతపురం రోడ్డులో ఉన్న రైల్వే గేటు నుంచి ముద్దునూరు రోడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండు దాకా వర్షాకాలం వాతావరణంలో నడవడం హాయిగా ఉంటుంది. విశాలమైన రోడ్లు, చెత్త కుప్పలు లేని పరిసరాలు, ఏపుగా పెరిగిన చెట్లు, ఆంధ్రలో ఒక చిన్న మునిసిపాలిటిలో నడుస్తున్నట్లు అనిపించదు.

ఆ ఊర్లో ఓపెన్ డ్రెయిన్లు ఎక్కడా కనిపించవు. జిల్లా కేంద్రాలలో కూడా కనిపించని శుభ్రత తాడిపత్రిలో కనిపిస్తుంది. ఈ విషయం అంతర్జాతీయ పరిశోధన పత్రాలకు కూడా ఎక్కింది.

ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు రావడంతో ఎదురైన అర్బనైజేషన్ తాకిడిని తాడిపత్రి మునిసిపాలిటీ సమర్థంగా ఎదుర్కొని ఇలా అందంగా తయారయింది.

తాడిపత్రి 2005 నాటికే మునిసిపాలిటి. 34 వార్డులలో మైక్రో లెవెల్ ప్లానింగ్ మొదలయింది. దేశంలో అప్పటికే బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలు పెట్టిన మునిసిపాలిటీలలో తాడిపత్రి ఒకటైంది.

చెట్లు నాటడం, వాటిని పరిరక్షించడం, అండర్ గ్రౌండ్ డ్రేనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్‌ను నిషేధించడం, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఇక్కడ మొదలైంది.

అంతేకాదు, వీటి నిర్వహణలో తాడిపత్రి జాతీయ దృష్టిని ఆకర్షించింది. తాడిపత్రి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.

ఇక్కడ రోడ్డు మీద ఎవరు చెత్త వేయరు. ప్లాసిక్ క్యారీబాగ్‌తో కనబడితే వింతగా చూస్తారు. తాడిపత్రిలో పట్టణ వాతావరణం చిత్రంగా కనిపిస్తుంది. ఈ పట్టణ పరివర్తన చాలా విచిత్రంగా విజయవంతమయింది.

దీని వెనక ఉన్న శక్తికూడా ఫ్యాక్షనిజమే. ఇంకా స్పష్టంగా చెబితే దీని వెనక ఉన్న వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్రేకం. ఆయన శక్తి ఆ ఉద్రేకమే. చెడుకైనా మంచికైనా అదే ఉద్రేకం. మున్సి పాలిటీ ఇలా మారేందుకు కారణం ఎవరంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అని తప్ప మరొక పేరు వినిపించదు.

''మామూలుగా అయితే తాడిపత్రి ప్రజలు కూడా మాట వినరు. కానీ, ప్రభాకర్ రెడ్డి వినేట్లు చేశారు. ఇంటి ముందుగాని, షాపు ముందు గాని చెట్టు ఎండిపోతే ఆయన ఊరుకోరు. మునిసిపాలిటీ వాళ్లు షాపు మూసేస్తారు, ఫైన్ వేస్తారు. పట్టణానికి సంబంధించి మునిసిపల్ ఆఫీసులోని స్టాఫ్‌ను, ప్రజలను బాగా భయపెట్టారు. అందుకే అంతా దారి కొచ్చారు'' అన్నారు వద్ది మునిస్వామి అనే చేనేత కార్మికుడు. గత పదిహేనేళ్లుగా తాడిపత్రిలో వచ్చిన మార్పును ఆయన స్వయంగా చూశారు.

తాడిపత్రిలో ఎవరిని అడిగినా ఒకటే సమాధానం. రూల్స్ పాటించకపోతే, ప్రభాకర్ రెడ్డి మనుషులు ఏమైనా చేస్తారనే భయం-భక్తి బాగా పనిచేసింది. అందుకే, ఎక్కడా చెత్త రోడ్డు మీద వేసే ధైర్యం ఎవరికీ ఉండదు. చివరకు ఈ క్రమశిక్షణకు వూరంతా అలవాటుపడింది.

''జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిష్టులే. అనుమానం లేదు. అట్లాంటి వాళ్లు ఉంటేగాని మన వాళ్లు మాట వినరు. ఇపుడు తాడిపత్రిలో ఎవరైనా సరే రోడ్డు మీద చెత్త వేయమనండి చూద్దాం'' అన్నారు టీచర్ గోపిరెడ్డి పరమేశ్వర రెడ్డి.

భయపెట్టి పనులు చేయించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత వరకు కరెక్ట్ అన్న ప్రశ్న ఎటూ వినిపిస్తూనే ఉంది.

అవసరమైనప్పుడు కర్ర వాడాను...

ప్రభాకర్ రెడ్డితో మాట్లాడటం కష్టం. మీడియాని ఆయన బాగా ద్వేషిస్తారు. బ్రదర్ నాకు మీడియా అంటే అసహ్యం అని నిక్కచ్చిగా చెబుతారు.

''అవును నేను ఫ్యాక్షనిస్టునే, రౌడీనే, దౌర్జన్యకారుడినే. రాసుకోండి. నన్నలా మార్చింది మీరే'' అని దబాయిస్తారు కూడా. రాజకీయ పరాజయాలు, పరాభవాలు ఎదురయినా, నేను చేయాల్సింది చేస్తాను. నాకు ముప్పు వుంది. అయినా సరే, ఈ దశలో నేను చావుకు భయపడితే ఎలా ? ఈ ఊరును సమూలంగా మార్చే పనిపెట్టుకున్నా'' అని బీబీసీతో అన్నారు ప్రభాకర్ రెడ్డి.

''చేతిలో కర్ర లేకుంటే పని ఎలా జరుగుతుంది? తాడిపత్రి మునిసిపాలిటీ బాగుపడింది కర్ర ఝళిపించినందుకే. కర్ర వాడేటపుడు వాడతాను'' అని కూడా ఆయన చెప్పారు.

ఈ విజయం ఎలాసాధ్యమయింది?

తాడిపత్రి మునిసిపాలిటీలో సంస్కరణలను అమలు చేసేందుకు ప్రభాకర్‌ రెడ్డి పకడ్బందీ వ్యూహం రచించారు. మునిసిపల్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఒకే వ్యూహాన్ని పాటించానని చెబుతారు.

మసక చీకట్లోనే ఆయన రేంజ్ రోవర్ కారు వేసుకుని ఊరంతా తిరిగే వారు. రోడ్డు మీద చెత్త కనబడితే, కారుదిగి దానిని తానే ఎత్తేసే వారు. దీన్ని అక్కడున్నవాళ్లంతా చూసేవారు. ప్రభాకర్ రెడ్డి వచ్చి ఇలా చేస్తున్నాడంటే, అంతకంటే వార్నింగ్ ఏముంటుంది? మరుసటి రోజు నుంచి అక్కడ చెత్త కనిపంచేది కాదు.

ఏదైనా షాపు ముందు చెట్టు ఎండిపోతే, బాధ్యత షాపు వాడితే. వేయి రుపాయల ఫైన్ చెల్లించాల్సిందే. ఫైన్ కట్టే దాకా షాపును మునిసిపాలిటీ వాళ్లు మూసేసేవారు. ఇలా కొంతమందికి ఫైన్ పడగానే ఊరంతా దారి కొచ్చింది.

ఇదే అస్త్రాన్ని ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రయోగించారు. మరుగుదొడ్ల నిర్మాణం, చెట్లు నాటడం, వాటిని కాపాడటం, చెత్త నిర్మూలన, ప్లాస్టిక్ నిషేధం, సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ ఏకకాలంలో అమలయ్యాయి. దీంతో తాడిపత్రి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక విశష్టమయిన మునిసిపాలిటీ అయింది.

ఇపుడు ప్రభాకర్ రెడ్డి వయసు 70 సమీపిస్తూ ఉంది. శారీరకంగా బలంగా లేరు. కానీ, ఆయనలో ఉద్రేకం తగ్గలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు అస్మిత్ రెడ్డిని ఓడించిన తాడిపత్రి మనుసు దోచుకునేందుకు ఆయన చివరి ప్రయత్నం చేస్తున్నారు.

తాడిపత్రి గతంలో లాగా ఇపుడు ఆయనంటే భయభక్తులతో ఉంటుందా, దూరంగా జరుగుతుందా చూడాలి.

అసలు భయభక్తులతో సంబంధం లేని ప్రజాస్వామిక మైన వాతావరణం నెలకొనే పరిస్థితులు ఎపుడొస్తాయి అనేది ఇంకా సుదీర్ఘమైన అంశం.

ప్రస్తుతానికైతే పోయిన పట్టును తిరిగి తెచ్చుకోవడానికి తనంటే జనంలో ఉన్న భయాన్ని ఉపయోగించుకుని ఒక మంచి పనితో ఇట్లా ఆయన ముందుకెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
JC Brothers: Holding a stick in the hand and leading democracy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X