కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ దోస్తి, మాజీ ప్రధాని, మాజీ సీఎం స్కెచ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: 2018 కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్, బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో కలిసి పోటీ చెయ్యడానికి జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, బీఎస్పీ చీఫ్, మాజీ సీఎం మాయవతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బలం లేని బీఎస్పీ !
కర్ణాటకలో జేడీఎస్ కు రైతుల పార్టీ అనే పేరు ఉంది. దళితులు, మైనారీలు బీఎస్పీ వైపు మొగ్గు చూపుతారని మాజీ ప్రధాని దేవేగౌడ భావిస్తున్నారు. కర్ణాటకలో బలం, అంతగా ప్రభావం లేని బీఎస్పీతో జతకడితే దళితులు, మైనార్టీల ఓట్లు తమకే వస్తాయని జేడీఎస్ భావిస్తోంది.

జేడీఎస్, బీఎస్పీకి ఇవే సీట్లు
కర్ణాటకలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ 204 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యనుంది. మిగిలిన 20 స్థానాలు బీఎస్పీకి ఇవ్వడానికి జేడీఎస్ అంగీకరించింది. సీట్లు సర్దుబాటు కావడంతో జేడీఎస్, బీఎస్పీ కలిసి పోటీ చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది.

ఢిల్లీలో చర్చలు !
న్యూఢిల్లీలో గురువారం జేడీఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డ్యానిష్ ఆలీ, బీఎస్పీ నేత సతీష్ చంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెళ్లడించారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బెంగళూరులో భారీ ర్యాలీ
ఫిబ్రవరి 17వ తేదీ శనివారం బెంగళూరులో జేడీఎస్, బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సమయంలో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సభలో ప్రసంగిస్తారని డ్యానిష్ ఆలీ, సతీష్ చంద్ర మీడియాకు చెప్పారు.

ఫలితం ఎలా ఉంటుంది
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా జేడీఎస్, బీఎస్పీలు అధిక సీట్లు కైవసం చేసుకుంటాయని అంచానా వేస్తున్నాయి. తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకోం అంటూ ఇంతకాలం చెప్పిన జేడీఎస్ చివరికి మాయావతితో పొత్తు పెట్టుకుంది. జేడీఎస్, బీఎస్పీ పొత్తు ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి అంటున్నారు కన్నడిగులు.












Click it and Unblock the Notifications