ఎన్నికల ప్రచారం వేళ- ఆసుపత్రిలో మాజీ ప్రధాని..!!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సాగిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఆసుపత్రిలో చేరడం జేడీఎస్ ను ఆందోళనలోకి నెట్టింది.
బెంగళూరు: ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు.. ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- ఇప్పటికే కర్ణాటకలో తొలివిడత ప్రచార కార్యక్రమాలను ముగించుకున్నారు.
అటు కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. ఈ బస్సు యాత్రకు దిశానిర్దేశం చేస్తోన్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. పంచరత్నాలను ఆయన ప్రచారం చేస్తోన్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ సూచనలతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రూపొందించుకుంటోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య దేవేగౌడ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం కలకలం రేపింది. జేడీఎస్ క్యాడర్ ను ఆందోళనలోకి నెట్టంది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు దేవేగౌడ. ఆయన 89 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆయన జేడీఎస్ అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపు కోసం వ్యూహాలను రూపొందిస్తోన్నారు. హాసన్, మండ్య జిల్లాల్లోనూ పర్యటించారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు.
కొంతకాలంగా తన తండ్రి ఆరోగ్యం బాగుండట్లేదని, ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవచ్చంటూ హెచ్ డీ కుమారస్వామి ఇదివరకే తెలిపారు కూడా. ఇవ్వాళ ఆయన కాలి నొప్పి కారణంగా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాలి నొప్పి తప్పించి ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని జేడీఎస్ బెంగళూరు జిల్లా నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications