వార్తల్లోకెక్కిన అమిత్- అంబానీ- అదాని
Jharkhand Assembly elecrtions 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 11.84 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 66.84 లక్షలు.
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో పర్యటించారు. షిండేగా జిల్లాలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీపై ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
ఇద్దరు ముగ్గురి కోసం బీజేపీ ఈ దేశాన్ని నడిపిస్తోందంటూ మండిపడ్డారు. 25 మంది బడా పారిశ్రామికవేత్తలకు చెందిన 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. వీరిలో ఏ ఒక్కరు కూడా బీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు లేరని పేర్కొన్నారు.
అమిత్ షా- అదాని- అంబానీల కోసమే ప్రధాని మోదీ పని చేస్తోన్నారంటూ విరుచుకుపడ్డారు. రైతు రుణాల మాఫీ గురించి తాము గొంతెత్తిన ప్రతీసారీ తమపై ఎదురుదాడికి దిగడం బాగా అలవాటైందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 50,000 రూపాయల రుణాల కోసం ఓ సామాన్య రైతును ఏ రకంగా పట్టి పీడిస్తున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications