పదునైన విశ్లేషణలకు పెట్టింది పేరు:ప్రముఖ జర్నలిస్టు శంకర్షణ్ ఠాకూర్ ఇక లేరు..!!
న్యూఢిల్లీ: ది టెలిగ్రాఫ్ ఎడిటర్‌గా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు శంకర్షణ్ ఠాకూర్ (63) అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం ఉదయం ఢిల్లీ సమీపంలోని ఒక ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
భారతదేశంలో అత్యుత్తమ జర్నలిస్టులలో శంకర్షణ్ ఠాకూర్ ఒకరు. 1962 జూలై 13న పాట్నాలో జన్మించిన ఆయన..పాట్నాలోని సెయింట్ జేవియర్స్, ఢిల్లీలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ హిందూ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు.

1984లో జర్నలిజం రంగంలో అడుగుపెట్టారు. సండే మ్యాగజైన్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తెహెల్కా, థర్డ్ ఐ టీవీ వంటి సంస్థల్లో పనిచేశారు. 2009లో తిరిగి ది టెలిగ్రాఫ్‌కు ఎడిటర్‌గా వచ్చారు.ఆయన పదునైన, సూటిగా ఉండే రాతలు, లోతైన విశ్లేషణలు భారతీయ జర్నలిజానికి గొప్ప విలువను తెచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ రాజకీయ జీవితాలపై ఆయన రాసిన పుస్తకాలు మంచి గుర్తింపు పొందాయి. అలాగే, కార్గిల్ యుద్ధంపై ఆయన రాసిన వ్యాసాల సంకలనం కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.
ప్రతిభకు గుర్తింపు
భారత ఎడిటర్స్ గిల్డ్ ఆయనను "భయం అంటే ఎరుగని గ్రౌండ్ రిపోర్టర్"గా అభివర్ణించింది. కార్గిల్ యుద్ధం, భోపాల్ దుర్ఘటన, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఇందిరా గాంధీ హత్య వంటి దేశాన్ని కదిలించిన ఎన్నో సంఘటనలను ఆయన ప్రజల ముందుకు తీసుకువచ్చారు. జర్నలిజంలో ఆయన చేసిన విశేష కృషికిగాను ప్రేమ్ భాటియా అవార్డు (2001) మరియు అప్పన్ మీనన్ ఫెలోషిప్ (2003) అందుకున్నారు.ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శంకర్షణ్ ఠాకూర్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications