భార్య కళ్ల ముందే జర్నలిస్టును కాల్చి చంపేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో జర్నలిస్టు దారుణ హత్యకు గురైనాడు. భార్యతో కలిసి ఇంటికి వెళుతున్న జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు రివాల్వర్ తో అతి సమీపం నుంచి కాల్చి చంపేసిన సంఘటన కన్నోజ్ జిల్లాలో జరిగింది.
దీపక్ గుప్తా అనే వ్యక్తి జర్నలిస్టుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ప్రాథమిక పాఠశాల దగ్గరకు వెళ్లి భార్యను పిలుచుకుని బైక్ లో ఇంటికి బయలుదేరాడు. దీపక్ గుప్తాను వెనుక నుంచి బైక్ లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు.
మార్గం మధ్యలో హసన్ పూర్ దగ్గర దుండగులు దీపక్ గుప్తా బైక్ ను అడ్డగించారు. తరువాత బైక్ లో ఉన్న ఓ దుండగుడు జేబులో ఉన్న రివాల్వర్ బయటకు తీసి దీపక్ గుప్తా తల మీద పెట్టి కాల్పులు జరిపి పరారైనారు.

ఒక్క నిమిషం షాక్ కు గురైన దీపక్ గుప్తా భార్య సహాయం కోసం కేకలు వేశారు. విషయం గుర్తించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దీపక్ గుప్తాను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే మార్గం మధ్యలో దీపక్ గుప్తా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకుని దీపక్ భార్య నుంచి వివరాలు సేకరించారు. దోపిడి కోసం వచ్చిన వారు దీపక్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీపక్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications