BJP Manifesto: ముహూర్తం ఫిక్స్: కీలక అంశాలు ఇవే..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.

ప్రధాని మోదీ శని, ఆదివారాల్లో కర్ణాటకలో సుడిగాలి పర్యటనలను నిర్వహించారు. బీదర్, బెళగావి, హసన్, కోలార్ జిల్లాల్లో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బెంగళూరు, రామనగర, మైసూరుల్లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య విస్తృతంగా పర్యటిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ఇవ్వాళ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్.. వంటి నేతలు ఇందులో పాల్గొననున్నారు.
సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు, మహిళాభ్యున్నతి, వ్యవసాయం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. వంటి అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. మహిళలపై ప్రత్యేకంగా వరాల జల్లును కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎరువుల పంపిణీ, వ్యవసాయ విద్యుత్.. వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. సామాజిక రిజర్వేషన్లపైనా ఈ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించడం సరికాదంటూ బీజేపీ ముందు నుంచీ చెబుతూ వస్తోన్న నేపథ్యంలో- దీనిపై ఓ స్పష్టమైన హామీ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications